Nara Lokesh: జగన్ లా నేను దొంగ హామీలు ఇవ్వను... నెరవేర్చే హామీలే ఇస్తా: నారా లోకేశ్

  • లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు ఐదో రోజు
  • పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
  • గ్రామాల్లో లోకేశ్ కు అపూర్వ నీరాజనాలు
  • వివిధ వర్గాలను కలుస్తూ ఉత్సాహంగా సాగుతున్న లోకేశ్
Lokesh continues his Yuvagalam Padayatra in Palamaneru constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో లోకేశ్ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు జగన్ పాలనలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని లోకేశ్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో లోకేశ్ మాట్లాడుతూ... బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని అన్నారు. 

"స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ. టీడీపీ హయాంలో 90 శాతం సబ్సిడీ తో రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చాం. మినీ గోకులంలు నిర్మించింది టీడీపీ" అని వివరించారు. కానీ జగన్ కురుబల గొంతు కోశాడని లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రిజర్వేషన్లు కట్ చెయ్యడం వలన పెద్ద ఎత్తున కురుబలు నష్టపోయారని వెల్లడించారు. 

కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను ఏర్పాటు చేశారు కానీ, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని అన్నారు. 3 ఏళ్ల 8 నెలల్లో  కురుబలకి ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని లోకేశ్ ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ పీకింది ఏంటి... కురుబలకి చేసింది ఏంటి? అని నిలదీశారు. 

"రిజర్వేషన్లు తగ్గించాం అని బీసీ శాఖ మంత్రి గారు స్వయంగా  ఒప్పుకుంటున్నారు. కానీ 16 వేల పదవులు పోలేదు అంటున్నారు. మరి ఎన్ని పదవులు పోయాయో ఆయనే చెప్పాలి. కురుబలపై జగన్ పాలనలో దాడులు పెరిగాయి" అని తెలిపారు. 

చెత్త మీద పన్ను వేసినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా? కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా? బీసీ రిజర్వేషన్లు కట్ చేసినందుకు జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలా? అని ధ్వజమెత్తారు. 

తాను జగన్ లా దొంగ హామీలు ఇవ్వనని... నెరవేర్చే హామీలే ఇస్తాని నారా లోకేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులతో కనకదాసు జయంతి పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. బీరప్ప ఆలయం అభివృద్ది, నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ద్వారా మినీ గోకులంలు నిర్మిస్తామని తెలిపారు. 

కాగా, లోకేశ్ పాదయాత్రకు ఇవాళ 5వ రోజు కాగా, పలమనేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా హుషారుగా సాగుతోంది. లోకేశ్ తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ లోకేశ్ ముందుకు సాగారు. 

లోకేశ్ కు గ్రామాల్లో మహిళలు దిష్టి తీశారు. తిలకం దిద్ది, హారతి పట్టారు. పలమనేరు నియోజకవర్గంలో వ్యవసాయ భూములను కూడా లోకేశ్ సందర్శించారు. అక్కడ సాగవుతున్న పంటలను పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

More Telugu News