Ekana Cricket Stadium: లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు

  • షాకింగ్ పిచ్ నేపథ్యంలో యూపీసీఏ నిర్ణయం
  • కొత్త క్యురేటర్ గా సంజీవ్ కుమార్ అగర్వాల్
  • ఐపీఎల్ కోసం పిచ్ తయారు చేసే బాధ్యతలు
Lucknow Curator Sacked For Preparing a Shocker pitch

ఆదివారం లక్నో వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో.. పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. విపరీతంగా టర్న్ అవుతూ, ఊహించని బౌన్స్ తో ఇబ్బంది పెట్టింది. రెండు టీమ్ లు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా.. పరుగులు 200 దాటలేదు. అన్ని ఓవర్లు ఆడి న్యూజిలాండ్ 99 పరుగులే చేయగా.. ఈ స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు టీమిండియా చివరి ఓవర్ దాకా ఆపసోపాలు పడింది. దీన్ని బట్టి చూస్తే పిచ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 

ఈ నేపథ్యంలో ఇలాంటి షాకింగ్ పిచ్ సిద్ధం చేసిన లక్నో క్రికెట్ స్టేడియం క్యురేటర్ పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) వేటు వేసింది. క్యురేటర్ పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో సంజీవ్ కుమార్ అగర్వాల్ ను నియమించింది. ‘‘ఈ గ్రౌండ్ లోని వికెట్ పై చాలా డొమెస్టిక్ మ్యాచ్ లు జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్ కోసం ఒకటి లేదా రెండు స్ట్రిప్స్ ను ఉంచాల్సింది. అన్నింటినీ ఉపయోగించడం, వాతావరణం అనుకూలించకపోవడం, సమయం లేకపోవడంతో కొత్త వికెట్ తయారు చేయలేకపోయాం’’ అని యూపీసీఏ వర్గాలు తెలిపాయి. 

ఐపీఎల్ టీం లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది హోం గ్రౌండ్. ఈ ఏడాది ఐపీఎల్ లో కనీసం 7 మ్యాచ్ లు ఈ మైదానంలో జరుగుతాయి. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లక్నో జట్టుకు కూడా ఇదే హోం గ్రౌండ్. దీంతో ఐపీఎల్ కోసం కొత్త పిచ్ ను తయారు చేసే బాధ్యతను సంజీవ్ కుమార్ కు అప్పగించారు. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీతో కలిసి ఆయన పని చేయనున్నారు. సంజీవ్ కు గతంలో బంగ్లాదేశ్ లో పిచ్ లను తయారు చేసిన అనుభవం ఉంది. 

ఇక మూడో టీ20 అహ్మదాబాద్ లో బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను దక్కించుకోనుంది. తొలి రెండు టీ20లో టీమిండియా, న్యూజిలాండ్ చెరో మ్యాచ్ గెలిచాయి.

More Telugu News