Nara Lokesh: రూ. 10 ఇచ్చేటప్పుడు నవ్వుతున్న జగన్ బొమ్మ ఉంటుంది.. రూ. 100 లాక్కునే వాటిపై మాత్రం ఉండదు: నారా లోకేశ్

  • వడ్డెర సంఘం సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్
  • జగన్ పాలనలో వడ్డెరలకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని విమర్శ
  • వడ్డెరల క్వారీలను పెద్దిరెడ్డి లాక్కున్నారని  మండిపాటు
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ చంద్రన్న బీమా పథకాన్ని తెస్తామని హామీ
  • సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని పిలుపు
Nara Lokesh fires on Jagan in meeting with Vaddera community

టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర ఈ ఉదయం పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పలమనేరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. రూ. 10 ఇచ్చే కార్యక్రమాలపై నవ్వుతున్న జగన్ బొమ్మ ఉంటుందని... ప్రజల నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసి టికెట్, చెత్త పన్ను, ఇంటి పన్ను తదితర కార్యక్రమాలపై మాత్రం ఆయన బొమ్మ ఉండదని ఎద్దేవా చేశారు. ఇచ్చే పది రూపాయలకు నవ్వుతూ ఉంటాడని... లాక్కునే వంద రూపాయలకు మాత్రం ఆయన ఫొటో ఉండదని విమర్శించారు. 

వడ్డెర సామాజికవర్గంలో పేదరికం ఎక్కువగా ఉందని లోకేశ్ అన్నారు. వడ్డెరలను సమస్యల నుంచి బయటపడేసేందుకు గతంలో చంద్రబాబు సత్యపాల్ కమిటీని వేశారని... ఆ కమిటీ నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వడ్డెర ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి రూ. 70 కోట్లు ఖర్చు చేశారని... జగన్ పాలనలో వడ్డెర కార్పొరేషన్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని విమర్శించారు. ఎస్టీల్లో ఉండాల్సిన వడ్డెరలను బీసీల్లో పెట్టారని అన్నారు. క్వారీలు తీసుకుని, రాళ్లు కొట్టుకుని, అమ్ముకోవడం వడ్డెరల కులవృత్తి అని... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన తర్వాత వారి నుంచి క్వారీలను లాగేసుకున్నారని విమర్శించారు. తరతరాలుగా వారికున్న ఉపాధిని దెబ్బకొట్టారని మండిపడ్డారు. 

వడ్డెరలు ప్రమాదవశాత్తు చనిపోతే చంద్రన్న బీమా పథకం కింద రూ. 5 లక్షలు వచ్చేవని, సహజమరణమైతే రూ. 2 లక్షలు వచ్చేవని... ఇప్పుడు ఏమీ లేదని చెప్పారు. మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న బీమా పథకాన్ని రూ. 10 లక్షలతో మళ్లీ తీసుకొస్తామని, ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెడతామని తెలిపారు. పెద్దిరెడ్డి ఏ క్వారీలను లాక్కున్నారో... వాటిని మళ్లీ క్వారీ ఓనర్లకు తిరిగి ఇస్తామని చెప్పారు. వారు దోచుచున్న డబ్బులను ముక్కు పిండి వసూలు చేస్తామని అన్నారు. వడ్డెర సామాజికవర్గానికి రాజకీయంగా మంచి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. సత్యపాల్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని చెప్పారు. జగన్ మాదిరి అబద్ధాలు చెప్పి తాను పారిపోనని అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని తెలిపారు. 

జగన్ ధరల బాదుడుకి కుప్పం, పలమనేరు ప్రజలు పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వలస పోతున్నారని లోకేశ్ విమర్శించారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రావడాన్ని పక్కనపెడితే... చంద్రబాబు తెచ్చిన కంపెనీలు కూడా జే ట్యాక్స్ కట్టలేక పారిపోతున్నాయని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని... యువతకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే తనపై 15 కేసులు పెట్టారని, వీటిలో హత్యాయత్నం కేసు కూడా ఉందని తెలిపారు. సైకో పాలనపై పోరాడుదామని, సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని పిలపునిచ్చారు.

More Telugu News