hide and seek: దాగుడు మూతలు ఆడుతూ.. దేశం దాటిన పదిహేనేళ్ల బంగ్లాదేశ్ అబ్బాయి: వీడియో ఇదిగో

  • బంగ్లాదేశ్ లో కంటెయినర్ లో చిక్కుకుని షిప్ లోకి..
  • సముద్ర మార్గంలో మలేషియాకు చేరిన వైనం
  • వారం రోజుల పాటు తిండీతిప్పలు లేవు..
  • జ్వరంతో బాధపడుతున్న కుర్రాడిని గుర్తించిన మలేషియా అధికారులు
  • ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడి
Bangladeshi boy finds himself in Malaysia after a game of hide and seek goes wrong unexpectedly

బంగ్లాదేశ్ కు చెందిన ఓ పదిహేనేళ్ల అబ్బాయి దాగుడు మూతలు ఆడుతూ ఏకంగా వేరే దేశానికి చేరాడు. స్నేహితులతో ఆడుతూ ఓ కంటెయినర్ లో దాక్కుని, అందులోనే నిద్రలోకి జారుకున్నాడు. మళ్లీ కళ్లు తెరిచే సరికి చుట్టూ మలేషియా అధికారులు కనిపించారు. చిట్టగాంగ్ కు చెందిన ఫాహిమ్ అనే కుర్రాడికి ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది.

ఫాహిమ్ తో మాట్లాడాక మలేషియా అధికారులు మీడియాకు చెప్పిన వివరాలు.. చిట్టగాంగ్ కు చెందిన ఫాహిమ్ ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి దాగుడు మూతలు ఆట మొదలు పెట్టాడు. స్నేహితులంతా తలా ఓ చోట దాక్కోవడంతో ఫాహిమ్ దగ్గర్లోనే ఉన్న ఓ కంటెయినర్ లో దాక్కున్నాడు. ఇంతలో నిద్ర ముంచుకురావడంతో అందులోనే పడుకున్నాడు. దురదృష్టవశాత్తూ ఫాహిమ్ ను గమనించని పోర్ట్ సిబ్బంది ఆ కంటెయినర్ కు తాళమేసి మలేషియా వెళ్లే ఓడలోకి చేర్చారు.

వారం రోజుల పాటు ఫాహిమ్ కంటెయినర్ లోనే చిక్కుకుపోయాడు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు.. దీంతో జ్వరం సోకింది. మలేషియా చేరాక కంటెయినర్ తెరిచిన సిబ్బందికి లోపల ఫాహిమ్ కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. తొలుత మానవ అక్రమ రవాణా కేసుగా భావించామని అధికారులు చెప్పారు. నీరసం, జ్వరంతో బాధపడుతున్న ఫాహిమ్ ను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించామని వివరించారు. కొద్దిగా కోలుకున్నాక ఫాహిమ్ అసలు విషయం చెప్పడంతో బంగ్లాదేశ్ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక ఫాహిమ్ ను బంగ్లాదేశ్ కు తిరిగి పంపించేస్తామని పేర్కొన్నారు.

More Telugu News