loan: మ్యూచువల్ ఫండ్స్, షేర్లపై రుణాలు తీసుకుంటే.. లాభ, నష్టాలు

  • తక్కువ వడ్డీకే రుణ సదుపాయం
  • సకాలంలో రుణ చెల్లింపులు చేయాలి
  • లేదంటే తనఖా ఉంచిన వాటిని బ్యాంకులు విక్రయించగలవు
  • పర్సనల్, క్రెడిట్ కార్డ్ రుణాల కంటే ఇవే నయం
Is it wise to take loan against mutual funds stocks See what experts say

అత్యవసరంగా రుణం కావాలంటే..? పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ సహా ఎన్నో మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. అలాగే, డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపైనా రుణం పొందొచ్చు. వీటిపైనా వడ్డీ తక్కువగానే ఉంటుంది.


సెక్యూర్డ్ నయం..
మనకు రుణం ఎప్పుడు కావాల్సి వచ్చినా.. తక్కువ వడ్డీకి లభించే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అధిక వడ్డీ రేటు ఉన్న వాటిని తీసుకోవడం వల్ల మనపై చెల్లింపుల భారం పెరిగిపోతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ అన్ సెక్యూర్డ్ రుణాలు. కనుక వీటిపై వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అదే గోల్డ్ లోన్, లోన్ అగైనెస్ట్ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ అనేవి సెక్యూర్డ్ రుణాలు. రుణ గ్రహీత ఒకవేళ చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో పడిపోతే.. తనఖాగా ఉంచిన వాటిని విక్రయించి తాము ఇచ్చిన రుణాన్ని పూర్తిగా రాబట్టుకోగలవు బ్యాంకులు. అందుకే తక్కువ వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తాయి. వినియోగదారులకు సైతం  ఇవే అనుకూలం.

వీటిని గమనించాలి..
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు తీసుకునే ముందు చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మన బంగారాన్ని విక్రయించుకోవాల్సిన పని లేదు. అలాగే, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ను విక్రయించుకోవడం, మూలధన లాభాల పన్ను కట్టాల్సిన అవసరం రాకుండా.. వాటిపై రుణం తీసుకోవడాన్ని మంచి ఆప్షన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. కాకపోతే డెట్ పెట్టుబడులపై అధిక మోతాదులో, ఈక్విటీ పెట్టుబడులపై తక్కువ మోతాదుకే రుణం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులు ఎప్పుడూ అస్థిరతలకు గురవుతుంటాయి. కనుక ఈక్విటీ పెట్టుబడుల విలువలో అధిక మొత్తానికి రుణం పొందకపోవడం మంచిది.  ఈక్విటీ పెట్టుబడులు అయితే 40-50 శాతం, డెట్ పెట్టుబడులు అయితే 70-75 శాతం విలువ వరకు రుణాలు పొందడం కొంత రక్షణగా ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్స్, షేర్లపై రుణాలు పొందినప్పటికీ అవి మన పేరుపైనే ఉంటాయి. కనుక రాబడుల ప్రయోజనం కోల్పోకుండా చూసుకోవచ్చు. కానీ, తీసుకునే రుణానికి చెల్లింపుల సామర్థ్యం ఉందా అని ముఖ్యంగా చూడాలి. రుణంపై వడ్డీని ప్రతి నెలా తప్పకుండా చెల్లించాలి. లేదంటే తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, షేర్లను బ్యాంకులు విక్రయించేసే ప్రమాదం ఉంటుంది.

More Telugu News