China: ఫ్రూట్ జ్యూస్ అనుకుని లిక్విడ్ డిటర్జంట్ తాగారు.. ఏడుగురికి అస్వస్థత

  • చైనాలోని ఓ రెస్టారెంట్ లో ఘటన
  • జ్యూస్ బాటిల్ మాదిరే ఉన్న డిటర్జంట్ బాటిల్ ను ఇచ్చిన వెయిటర్
  • లిక్విడ్ తాగడంతో అస్వస్థత.. ఆసుపత్రిలో మొత్తం కక్కించిన డాక్టర్లు
Restaurant In China Serves Liquid Detergent Instead Of Fruit Juice

రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రూట్ జ్యూస్ కు బదులు హోటల్ సిబ్బంది లిక్విడ్ డిటర్జంట్ ను సర్వ్ చేశారు. జ్యూస్ అనుకుని అది తాగిన ఏడుగురు.. తేడాగా ఉండటంతో ఆసుపత్రికి పరుగులు తీశారు. అక్కడ డాక్టర్లు ‘స్టమక్ పంపింగ్’ ద్వారా తిన్నది, తాగింది అంతా కక్కించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందట. చైనాలోని జెజింగ్ ప్రావిన్స్ లో జనవరి 16న జరిగిన ఘటన వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్ సీఎంపీ) తాజాగా వెల్లడించింది.

సిస్టర్ వుకాంగ్ అనే మహిళ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు వెళ్లింది. జ్యూస్ అడిగితే.. వెయిటర్  ఓ బాటిల్ ను తెచ్చి పెట్టారు. దాన్ని తాగిన వాళ్లకు.. రుచి ఘోరంగా అనిపించింది. గొంతు నొప్పి మొదలైంది. దీంతో అందరూ ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ విషయాలను వివరిస్తూ వుకాంగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. కానీ తర్వాత తొలగించింది.

‘‘అక్కడ పని చేసే మహిళకు చూపు సమస్య ఉండటమే దీనికి కారణమని తర్వాత తెలిసింది. పైగా రెస్టారెంట్ లో పని చేసిన అనుభవం ఆమెకు పెద్దగా లేదట. ఆ రోజు సహాయకురాలిగా వచ్చిందట’’అని వుకాంగ్ తెలిపింది. తాము ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పింది. ఏడుగురి ఆరోగ్యం నిలకడగానే ఉందని, బాధితులకు రెస్టారెంట్ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని పోలీసులు తెలిపారు.

వీరికి వెయిటర్ సర్వ్ చేసిన లిక్విడ్ ఏదనేది తెలియరాలేదు. కానీ స్థానికంగా ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ లాంటి ప్యాకింగ్ తోనే కొన్ని ఫ్లోర్ క్లీనర్ల బ్రాండ్లు అమ్ముతున్నారట. వాటిపై విదేశీ భాషల్లో రాసి ఉండటం, అవి స్థానికులకు అర్థం కాకపోవడంతో ఫుడ్ ఐటమ్ అనుకుని పొరబడుతున్నారట. ఈ నేపథ్యంలో జ్యూస్ అనుకుని లిక్విడ్ డిటర్జంట్ సర్వ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News