Gujarat: గుజరాత్ లో పోటీ పరీక్ష.. హైదరాబాద్ లో పేపర్ లీక్

నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ పై కేసు
పరీక్ష వాయిదా వేసిన అధికారులు
ఆందోళన వ్యక్తంచేస్తున్న నిరుద్యోగులు
gujarat competitive exam paper leaked in hyderabad

గుజరాత్ లో ఆదివారం జరగాల్సిన పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించినట్లు గుర్తించి, ప్రెస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో రెండు గంటల్లో జరగబోయే పరీక్ష కోసం పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు పరీక్ష వాయిదా పడ్డ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ వ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 9.50 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేపర్ లీక్ కావడం, పరీక్షను అధికారులు వాయిదా వేయడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పేపర్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, త్వరలోనే నియామక పరీక్షను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని 1,181 పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం జరగాల్సిన పరీక్షకు సిద్ధమయ్యారు. తీరా చివరి క్షణంలో పేపర్ లీక్ కారణంగా పరీక్ష వాయిదా పడింది. మరోవైపు, పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోందని విమర్శించారు. పేపర్ లీక్ కారణంగా గత 12 ఏళ్లలో 15 సార్లు పోటీ పరీక్షలు రద్దయ్యాయని కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి వెల్లడించారు.

More Telugu News