Periods: క్రమం తప్పకుండా పీరియడ్స్.. ఈ ఆహారం అవసరం

  • నెలసరిపై హార్మోన్లలో అసమతుల్యత, పోషకాల లేమి, ఒత్తిడి ప్రభావం
  • వీటిని నివారించే ఆహారం తీసుకోవాలి
  • బొప్పాయి, సోంపు, కలబంద, వాముతో ఉపయోగాలు
Periods Include These 6 Foods To Your Diet For A Healthy Menstruation Cycle

స్త్రీలకు నెలసరి (రుతు చక్రం/మెనుస్ట్రుయేషన్ సైకిల్) అన్నది ఆరోగ్య కోణం నుంచి చూస్తే ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. హార్మోన్ల ఉత్పత్తి, పునరుత్పత్తికి ఇది అత్యంత కీలకమైనది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నెలసరి ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతులకు ప్రతి 28 రోజులు లేదా 30 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. రుతుస్రావం నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. 


కొందరిలో ఈ నెలసరి చక్రం భిన్నంగా ఉండొచ్చు. కొందరికి ఒకటి రెండు రోజులు అటూ, ఇటూగా వస్తుంటుంది. ఇది కూడా సాధారణమే. అలా కాకుండా 21 రోజుల్లోపే నెలసరి వచ్చేస్తుండడం (త్వరత్వరగా), లేదంటే 35 రోజులు దాటిన తర్వాత, రెండు నెలలకోసారి పీరియడ్స్ వచ్చేవారూ ఉంటారు. దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెబుతారు. అలాగే, నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం కావడం, ఏడు రోజులు దాటిన తర్వాత కూడా కొనసాగుతుండడం అనారోగ్యానికి చిహ్నంగా చూడాలి.

పోషకాల లేమి, ఒత్తిడి, పునరుత్పత్తి అవయవానికి సంబంధించి ఇతర సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితులు కనిపించొచ్చు. అందుకని ఇలా సమయం తప్పి పీరియడ్స్ వచ్చే వారు తప్పకుండా ఓ సారి వైద్యులను సంప్రదించాలి. పీరియడ్స్ సరిగ్గా రావడం లేదంటే హార్మోన్లలో మార్పులు వచ్చాయేమో చూసుకోవాలి. అవసరమైతే చికిత్స కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇక తమవంతుగా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాల లేమిని నివారించుకోవచ్చు. ముఖ్యంగా నెలనెలా పీరియడ్స్ టైమ్ కు వచ్చేందుకు సాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే..?

బొప్పాయి
బొప్పాయి పండులో కెరోటిన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయులను పెంచుతుంది. గర్భాశయం సంకోచానికి సైతం సాయపడుతుంది.

వాము
వాము వాటర్ గురించి వినే ఉంటారు. ఇది తీసుకున్నా నెలసరి సక్రమంగా వస్తుంది. వామును నీటిలో కాచి తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలోవెరా
దీన్నే కలబందగా చెబుతారు. ఇందులో ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్, శాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీ, ఈ, బీ12 ఉంటాయి. హార్మోన్లు సక్రమంగా పనిచేసేందుకు ఇవి అవసరం. పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే హార్మోన్ల ఉత్పత్తి తగినంత ఉండాలి. 

దాల్చిన చెక్క
ఇన్సులిన్ స్థాయులు హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. దాల్చిన చెక్కలో ఉండే గుణాలు ఇన్సులిన్ స్థాయులను నియంత్రిస్తాయి. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య ఉన్న వారు కూడా దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

పైనాపిల్
పైనాపిల్ లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. దీంతో పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి.

సోంపు
పీరియడ్స్ ను రెగ్యులర్ చేయడంలో సోంపు కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్ల సమతుల్యం చేయగలదు. నెలసరి సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.

More Telugu News