BRS: బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

  • ఈ నెల 29న ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేయనున్న కేసీఆర్
  • గవర్నర్ వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం
BRS Parliamentary Party meeting at Pragati Bhavan on 29th of this month

పార్లమెంటు బడ్జెట్-2023 సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించబోయే అంశాలపై, అనుసరించే వ్యూహంపై పార్టీ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు ఇతర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. 

కొంతకాలంగా గవర్నర్, సీఎంకు మధ్య పడటం లేదు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ పై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ఎంపీలకు ఎలాంటి సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా ఏప్రిల్ 6వ తేదీ వరకు జరగనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. మొత్తం 66 రోజుల పాటు సమావేశాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇక కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News