Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ డీజీపీని కలిసిన కాంగ్రెస్ బృందం

  • మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు
  • తమ నేతలపై దాడులు జరిగాయన్న రేవంత్ రెడ్డి
  • కేసులు నమోదు చేయాలంటూ డీజీపీకి వినతి
Revanth Reddy and Congress leaders met DGP

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు రాష్ట్ర డీజీపీని కలిశారు. నాగర్ కర్నూలు జిల్లా మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులపై దాడులు జరిగాయని డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల సమయంలో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టు ప్రకటించారని, కానీ ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టు ముందుకు కదలడంలేదని విమర్శించారు. అయితే, ఆ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (నాగం జనార్దన్ రెడ్డి) అక్కడ పర్యటించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

అయితే, తమ నేతను టీఆర్ఎస్ నాయకులు దూషించడమే కాకుండా, ఆయనతో కలిసి వచ్చిన ఆ ప్రాంత ప్రజలపై దాడులు చేశారని ఆరోపించారు. ఒకరి గొంతు మీద కాలేసి తొక్కారని, మరొకరిని కొట్టారని, తీవ్ర పదజాలంతో దూషించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాధితుల్లో ఒకరు గిరిజనుడు కాగా, రెండో వ్యక్తి దళితుడు అని వెల్లడించారు. 

గొంతు మీద కాలేసి తొక్కినందుకు హత్యాయత్నం కేసు, దూషించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్లను వెంటనే అరెస్ట్ చేస్తారని ఆశించామని, కానీ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అక్కడికి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలపై ఎదురు కేసులు పెట్టారని ఆరోపించారు. 

మహిళా సర్పంచిని అవమానించారంటూ నాగంపై తప్పుడు ఆరోపణలు మోపారని వెల్లడించారు. ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్యకు ఇది నిదర్శనమని విమర్శించారు. ఈ బరితెగింపు చర్యలకు పాల్పడిన స్థానిక పోలీసుల మీద, అక్కడికి వచ్చిన నేరగాళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ ఇవాళ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

More Telugu News