KCR: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభ

  • దూకుడు పెంచుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • ఖమ్మంలో ఈ నెల 18న బహిరంగ సభ
  • సభకు హాజరుకానున్న పలువురు సీఎంలు, మాజీ సీఎంలు
BRS Sabha in Khammam on Jan 18

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడు పెంచుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 

ఈ సభను తొలుత ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ... రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజున ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ సభకు సంబంధించి నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలతో కేసీఆర్ చర్చించారు. 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను ఆహ్వానించనున్నారు. ఈ సభను తెలంగాణలో ఎన్నికల పర్వానికి నాందిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News