BRS: ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

  • ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన తోట చంద్రశేఖర్
  • పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చ
  • ఆవిర్భావ సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన
  • మండల, జిల్లా కమిటీలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ సూచన
BRS Plan To Big Public Meeting In Andhrapradesh

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలు ఇటీవల బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్ సహా మరికొందరు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. 

నిన్న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే, ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు రూపకల్పన చేయాలని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు.

More Telugu News