Perni Nani: కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పేర్ని నాని తీవ్ర విమర్శలు

  • ఆంధ్రప్రదేశ్ కు ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసన్న పేర్ని నాని
  • టీఆర్ఎస్ నేతలు ఏపీని మోసం చేశారని మండిపాటు
  • ఏపీలో కేసీఆర్ చేసేదేముందని ఎద్దేవా
YSRCP leader Perni Nani strong comments on BRS

బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించింది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా పార్టీ బాధ్యతలను నిర్వహిస్తారని కేసీఆర్ తెలిపారు. వజ్రాల్లాంటి ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ఏపీలోని సిట్టింగ్ నేతలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తమతో కలిసి నడిచేందుకు ఏపీలోని చాలా వర్గాల ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు. 

మరోవైపు, బీఆర్ఎస్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఏపీలో కేసీఆర్ చేసేదేముందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసని... టీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్ పెండింగ్ బకాయిలను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని... శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి అక్రమంగా విద్యుత్ ను తీసుకుంటున్నారని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిన టీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు ఏపీ సంక్షేమం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. అయినా, గత ఎన్నికల్లో కేఏ పాల్ కూడా ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేశారని.. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పేముందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

More Telugu News