Rahul Dravid: బీసీసీఐ కీలక నిర్ణయం.. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్!

  • ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనున్న ద్రావిడ్ పదవీ కాలం
  • ఆ తర్వాత పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయం
  • లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని యోచన
VVS Laxman likely to replace Rahul Dravid as India head coach

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రావిడ్ పదవీ కాలాన్ని ఇక పొడిగించకూడదని, అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచింగ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది.

భారత జట్టు గతేడాది ప్రదర్శనపై ఈ నెల 1న ముంబైలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్ష సమావేశం సందర్భంగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి రోడ్‌ మ్యాప్‌పై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది నవంబరులో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీని తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడి పదవీకాలాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆ స్థానాన్ని వీవీఎస్ లక్ష్మణ్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది. 

జూనియర్ జట్టు కోచ్‌గా ద్రావిడ్ అద్వితీయ విజయాలు అందుకున్నాడు. అయితే, సీనియర్ జట్టుకు మాత్రం విజయాలు అందించడంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఐసీసీ మేజర్ టోర్నీలలో భారత్ బొక్కబోర్లా పడింది. ద్రావిడ్ స్థానాన్ని లక్ష్మణ్‌తో భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.

లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు కొత్తేమీ కాదు. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టుకు ఇన్‌చార్జ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రావిడ్ కరోనా బారినపడడంతో ఆసియాకప్‌ 2022లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. తొలిసారి ఐర్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇన్‌చార్జ్ కోచ్‌గా పనిచేశాడు. జింబాబ్వేలో ఆ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే, టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్ పనిచేశాడు. వీవీఎస్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్నాడు.

More Telugu News