Thota Chandrasekhar: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్.. ప్రకటించిన కేసీఆర్

  • బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు
  • పార్టీ కండువాలు కప్పిన సీఎం కేసీఆర్
  • వజ్రాల్లాంటి ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారని వెల్లడి
  • పలువురు సిట్టింగ్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు
CM KCR announces Thota Chandrasekhar as BRS AP President

ఏపీ నేతలు రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు. రావెల కిశోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా బాధ్యతలను నిర్వర్తిస్తారని కేసీఆర్ తెలిపారు. 

వజ్రాల్లాంటి ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీలో పలువురు సిట్టింగ్ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వెంట వచ్చేందుకు చాలా వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. 

ఏ కార్యక్రమమైనా మొదట చిన్నదిగానే ఉంటుందని, విజయతీరం చేరాలంటే ఎన్నో అవహేళనలు దాటాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉన్నవారినే విజయలక్ష్మి వరిస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశం ఎటువైపు వెళుతోందో ఇవాళ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇంత సువిశాల దేశానికి సామూహిక లక్ష్యం ఉండాలి... వ్యవస్థీకృతంగా పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అని అభిప్రాయపడ్డారు. 

ఏంచేసైనా సరే ఎన్నికల్లో గెలవడమే కొన్ని పార్టీల లక్ష్యం అని వ్యాఖ్యానించారు. విద్వేషాలు, మతకల్లోలాలు రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్నారు అని విమర్శించారు. గొంతెత్తి మరీ మేకిన్ ఇండియా నినాదం ఇస్తున్నారని, కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చైనా నుంచి వస్తున్నాయని అన్నారు. మనదేశంలోని ప్రతి వీధిలో చైనా బజార్లు ఉన్నాయి... మరి మేకిన్ ఇండియా నిజమైతే ఇన్ని చైనా బజార్లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. 

ఏటా వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని కేసీఆర్ వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ సరిపడా నీళ్లు దొరకడంలేదని తెలిపారు.

దేశంలో పంటలు బాగా పండే భూములు 43 కోట్ల ఎకరాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవి అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు అని తెలిపారు. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని చెప్పారు. పనిచేసే జనాభా ఎక్కువగా ఉండడం మన దేశానికి పెద్ద సంపద అని అభివర్ణించారు. ఇన్ని అనుకూలతల మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక ఆహారోత్పత్తి దేశంగా మారాలని అభిలషించారు.

More Telugu News