BRS: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలు

  • ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ
  • రావెల, తోట, పార్థసారథి తదితరుల చేరిక 
  • ఏపీ నేతలకు పార్టీ కండువా కప్పిన కేసీఆర్
AP leaders joins BRS Party

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏపీకి కూడా విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ప్రణాళికలో భాగంగా నేడు తొలి అడుగుపడింది. ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఏపీ నేతలు ఈ సాయంత్రమే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వారికి కండువాలు కప్పిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లోకి సాదరంగా స్వాగతం పలికారు. ఏపీకి చెందిన జేటీ రామారావు, రమేశ్ నాయుడు, టీజే ప్రకాశ్, నయీముల్ హక్, శ్రీనివాస్ నాయుడు, మణికంఠ, ఫణికుమార్, వంశీకృష్ణలకు కూడా కండువాలు కప్పిన సీఎం కేసీఆర్ వారిని పార్టీలోకి స్వాగతించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాదని, బీఆర్ఎస్ పార్టీ దేశం కోసం అని వెల్లడించారు. లక్ష్యశుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని స్పష్టం చేశారు.

కాగా, తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చన్నది కేసీఆర్ ప్రణాళిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తోట చంద్రశేఖర్ గత ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

More Telugu News