Team India: బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం

  • 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు
  • అక్షర్ కు 4, కుల్దీప్ యాదవ్ కు 3 వికెట్లు
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కుల్దీప్
 India win by 188 runs in first test

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో   324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. జాకిర్ హసన్ (100), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84), నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) రాణించారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహిదీ హసన్‌(13)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. 

ఆ తర్వాత ధాటిగా పోరాడుతున్న కెప్టెన్ షకీబల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. కాసేపటికే తైజుల్ ఇస్లాం (4) అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అవగా.. ఎబాదత్ అహ్మద్ (0)ను కుల్దీప్ యాదవ్ చివరి వికెట్ గా వెనక్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ను భారత్ 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 40 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈనెల 22 నుంచి  మీర్పూర్ లో జరగనుంది.

More Telugu News