Shakib Al Hasan: టీమిండియాపై షకీబల్ హసన్ అరుదైన రికార్డు

  • భారత్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్
  • 10 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన షకీబల్ హసన్
  • భారత్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు
 Shakib al Hasan achieves elusive milestone with 5 wicket haul in 1st ODI against India

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌లో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లాదేశ్ విజయంలో ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐదు వికెట్లు పడగొట్టిన షకీబ్ భారత్‌పై అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఎనిమిదో స్పిన్నర్. గతంలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ ఈ ఘనత సాధించారు.

బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో అన్ని విభాగాల్లోనూ విఫలమైన భారత్ చేతిలోకొచ్చిన మ్యాచ్‌ను జారవిడుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. బంగ్లా బౌలర్ల పదునైన బంతులకు తలొగ్గిన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా పూర్తి 50 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయారు. 41.2 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేయగలిగారు. కేఎల్ రాహుల్ 73 పరుగులు చేసి జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించడంలో సాయపడ్డాడు.

అనంతరం 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. దాంతో భారత్ విజయం ఖాయమనే అనుకున్నారంతా. కానీ, ఆ తర్వాత ఏడు ఓవర్లు వేసిన బౌలర్లు చివరి వికెట్‌ను నేలకూల్చడంలో విఫలమయ్యారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. 

More Telugu News