Mallikarjun Kharge: నా వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మల్లికార్జున ఖర్గే

  • గుజరాత్ ఎన్నికల్లో మోదీ ప్రచారం
  • మోదీ 100 తలల రావణుడా అంటూ ఖర్గే విమర్శలు
  • ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారానికి వస్తున్నారని వ్యాఖ్యలు
  • ఖర్గేను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు
Mallikarjun Khrage take a jibe at BJP leaders

ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తన విధులు మర్చిపోయి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు, ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారానికి వస్తున్నారంటూ ఖర్గే విమర్శించారు. 

ప్రధాని స్థాయి వ్యక్తి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో దిగడం ఏంటని, మోదీ ఏమైనా 100 తలల రావణుడా? అని ప్రశ్నించారు. అభ్యర్థుల పేరుతో బీజేపీ ఓట్లు అడగాలని, మోదీ వచ్చి మున్సిపాలిటీలో పనిచేయలేరు కదా? అంటూ వ్యాఖ్యానించారు. దాంతో బీజేపీ నేతలు ఖర్గేను టార్గెట్ చేశారు. ఆయనపై తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధించారు. 

ఈ నేపథ్యంలో ఖర్గే స్పందించారు. తన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయలేదని, వ్యక్తిగత విమర్శల జోలికే వెళ్లలేదని ఖర్గే స్పష్టం చేశారు. 

రాజకీయాలు అనేవి వ్యక్తులకు సంబంధించినవి కావని, రాజకీయాలు సిద్ధాంతాలకు సంబంధించినవని అన్నారు. కానీ బీజేపీ మాత్రం ఒక్క వ్యక్తి కోసమే రాజకీయాలు చేస్తోందని చురక అంటించారు. తన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ గుజరాత్ ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఖర్గే విమర్శించారు.

More Telugu News