SJ Surya: ఓటీటీ రివ్యూ: 'వదంతి' (అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్)

  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే కథ
  • కథలో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్
  • ఆకట్టుకునే క్లైమాక్స్ ట్విస్టు
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్  
  • ఎపిసోడ్స్ నిడివిని పెంచిన సాగతీత సన్నివేశాలు  
OTT Review On Vadhandhi WebSeries

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ పెరిగింది. దాంతో నిర్మాణ విలువల పరంగా క్వాలిటీ విషయంలో ఎంతమాత్రం రాజీ పడకుండా వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్లో రూపొందే వెబ్ సిరీస్ లను చూడటానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అందువలన ఆ తరహా జోనర్లోనే ఎక్కువ వెబ్ సిరీస్ లు పలకరిస్తున్నాయి. అలా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించిన వెబ్ సిరీస్ నే 'వదంతి'. 

ఇది ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్. ఎస్.జె సూర్య .. లైలా .. సంజన .. నాజర్ .. స్మృతి వెంకట్ .. వివేక్ ప్రసన్న ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ ను, వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఆండ్రూస్ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి సైమన్ కె కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. నిన్నటి నుంచే ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే .. కన్యాకుమారిలో రూబీ (లైలా) ఒక లాడ్జ్ ను రన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒక్కగా నొక్క  కూతురు వెలోని (సంజన). ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి తల్లినే అన్ని వ్యవహారాలు చూస్తూ ఆమెను పెద్ద చేస్తుంది. వెలోని అందమైన అమ్మాయి .. అల్లరి అమ్మాయి. అయితే తనని తల్లి అతిగా కంట్రోల్ చేస్తోందనే ఉద్దేశంతో ఆమె ఉంటుంది. అలాగే తన కూతురు తన మాటను వినడం లేదనే అసహనం రూబీలో ఎక్కువగా ఉంటుంది. 

ఆ లాడ్జ్ లో చాలా రోజులుగా ఉంటూ వస్తున్న విఘ్నేశ్ తో రూబీ కుటుంబానికి సాన్నిహిత్యం పెరుగుతుంది. దాంతో అతనికి తన కూతురునిచ్చి రూబీ పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే ఆ పెళ్లి పట్ల వెలోని అయిష్టంగా ఉంటుంది. ఒక రోజున మేనత్త ఇంటికని వెళ్లిన వెలోని, ఒక నిర్జన ప్రదేశంలో శవమై తేలుతుంది. ఈ మర్డర్ కేసు ఎస్.ఐ.వివేక్ (ఎస్.జె.సూర్య)కి అప్పగించబడుతుంది. దాంతో అన్ని వైపుల నుంచి అతను తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. 

రూబీ లాడ్జ్ లో చాలా కాలంగా ఉంటూ వస్తున్న విఘ్నేశ్ పైన .. కొన్ని రోజుల పాటు ఆ లాడ్జ్ లో ఉండివెళ్లిన రైటర్ సెబాస్టియన్ (నాజర్) పైన .. అలాగే వెలోని లవర్ గా చెప్పుకుంటున్న టోని పైన వివేక్ కి అనుమానం కలుగుతుంది. వెలోని శవం లభించిన చోటున ఆమె హత్య జరగలేదనీ, అక్కడికి దగ్గరలోని ఫారెస్టులో జరిగిందని అతని పరిశీలనలో తేలుతుంది. ఆమె ఎవరితో ఫారెస్టుకు వచ్చిందనే దిశగా వివేక్ విచారణ మొదలెడతాడు. 

ఆ ఫారెస్టులో చాలా కాలంగా ఉంటున్న ఒక కుటుంబంపై ఎస్.ఐ.వివేక్ కి అనుమానం కలుగుతుంది. వాళ్లు చాలా సాధారణమైన వ్యక్తులుగా కనిపిస్తున్నా, వారి వెనుక బలమైన శక్తులు ఉన్నాయని గ్రహిస్తాడు. ఈ కేసులో ప్రధానమైన అనుమానితుడు విఘ్నేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో, పై అధికారులు కేసు క్లోజ్ చేస్తారు. వెలోని హత్య వెనుక అసలు కారణమేమిటో తెలుసుకుని తీరాలనే పట్టుదలతో, ఎస్పీ మాటలను కూడా ఖాతరు చేయకుండా వివేక్ ముందుకు వెళతాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వెలోనీని ఎవరు హత్య చేశారు? ఎందుకోసం హత్య చేశారు అనేదే కథ.

ఆండ్రూస్ తయారు చేసుకున్న ఈ కథ అనేక మలుపులు తీసుకుంటూ ఆకట్టుకుంటుంది. కథనం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ కూడా తరువాత ఎపిసోడ్ పై కుతూహలాన్ని పెంచుతుంది. ఒక వైపున మిగతా పాత్రల కోణంలో వెలోని జీవితాన్ని చూపిస్తూనే, మరో వైపున ఆమె మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తూ ఉండటం వలన, ప్రధానమైన పాత్ర అయిన వెలోనితో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఉంటారు. వెలోని హత్య విషయంలో ఒక్కో పాత్రపై అనుమానాన్ని రేకెత్తించే తీరు .. క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ కూడా ఎంతమాత్రం గెస్ చేయనివిగా ఉంటాయి. 

దర్శకుడు ప్రతి పాత్ర పట్ల స్పష్టమైన అవగాహనతో డిజైన్ చేసుకున్నాడు. ఆ స్వభావాల నుంచి బయటికి రాకుండా ఆ పాత్రలు నడుస్తాయి. చాలా సహజంగా పాత్రలను నడిపించడం వలన కూడా కథకు త్వరగా కనెక్ట్ కావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి కథల్లో ఎంక్వైరీ పేరుతో పోలీసుల హడావిడి కనిపిస్తుంది. అలాంటి హడావిడి ఇందులో కనిపించదు. వెబ్ సిరీస్ కనుక .. కథను కాస్త వివరంగా .. కూల్ గా చెప్పుకుంటూ వెళ్లొచ్చు అనే ధోరణిలో కథనం నిదానంగా నడుస్తుంది. 

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కాకపోతే కథనంలో ఆశించిన స్థాయి వేగం లేక కాస్త బోర్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటి లోపాలను సరిచేస్తూ అద్భుతమైన ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ కథ కోసం ఎంచుకున్న లొకేషన్స్ .. ఆ లొకేషన్స్ ను శరవణన్ రామసామి తన కెమెరాలో అందంగా బంధించిన తీరు బాగుంది. ప్రతి ఫ్రేమ్ ఒక గ్రీటింగ్ కార్డుమాదిరిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫారెస్టు నేపథ్యంలోని దృశ్యాలను ఆయన గొప్పగా చిత్రీకరించాడు.  

ఇక సైమన్ కె కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కథతో పాటు ట్రావెల్ చేయిస్తుంది. సన్నివేశాల్లో ప్రేక్షకులను భాగం చేస్తుంది. కొన్ని సన్నివేశాలు కాస్త డల్ గా అనిపించినప్పటికీ, ఆ తరువాత సీన్స్ ను ఆయన బీజీఎమ్ తో పైకి లేపుతూ వెళ్లాడు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. కథలో ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. 

ఒక అందమైన యువతి మర్డర్ కేసు .. చుట్టూ అనుమానితులుగా కొంతమంది కుర్రాళ్లు .. గతంలో ఆమెతో సాన్నిహిత్యంతో మసలుకున్నవాళ్లు .. ఫారెస్టులో హత్యకు సంబంధించిన ఆనవాళ్లు .. అక్కడివాళ్లకి రాజకీయ నాయకులతో ఉన్న లింకులు .. కేస్ ను క్లోజ్ చేయమంటూ పై అధికారుల నుంచి ఒత్తిళ్లు .. ఇలాంటివన్నీ తట్టుకుని ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఎలా డీల్ చేశాడనే ఈ కథను దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అయితే కథను డీటెయిల్డ్ గా చెప్పడానికి ప్రయత్నించడం వలన కాస్త సాగతీతగా అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ లో చెప్పిన ఈ కథను టైట్ కంటెంట్ తో 6 ఎపిసోడ్స్ లో చెప్పచ్చు అనిపిస్తుంది. స్లో నేరేషన్ ను కాస్త తట్టుకుని చూస్తే, ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ నే అనిపిస్తుంది.

More Telugu News