Pattabhi: సంకల్ప సిద్ధి స్కాం నేపథ్యంలో వల్లభనేని వంశీపై పట్టాభి విమర్శనాస్త్రాలు

  • సంకల్ప సిద్ధి స్కాంలో పలువురి అరెస్ట్
  • వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పట్టాభి
  • వంశీకి దమ్ముంటే అనుచరులను పోలీసులకు అప్పగించాలని సవాల్
Pattabhi slams Vallabhaneni Vamsi

సంకల్ప సిద్ధి సంస్థ డైరెక్టర్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు సంస్థ ఎండీ వేణుగోపాల్, డైరెక్టర్ కిశోర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను వారం పాటు కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ధ్వజమెత్తారు. 

సంకల్ప సిద్ధి స్కామ్ వ్యవహారంలో వల్లభనేని వంశీ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మా మీద డీజీపీకి ఫిర్యాదు చేసినంత మాత్రాన నిజాలు దాచలేరని పేర్కొన్నారు. గోడలు దూకి, పార్టీలు ఫిరాయించే వల్లభనేని వంశీని ప్రజలు ముద్దుగా 'జంపింగ్ జపాంగ్' అని పిలుస్తున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. వంశీకి దమ్ముంటే అతడి అనుచరులను పోలీసులకు అప్పగించాలని, వారి ఫోన్ కాల్స్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. సంకల్ప సిద్ధి స్కాంలో సీబీఐ విచారణ కోరే దమ్ము వల్లభనేని వంశీకి ఉందా? అని ప్రశ్నించారు.

అంతకుముందు, సంకల్ప సిద్ధి ఈ-కార్ట్ వ్యవహారంలో తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ స్కాంలో తనకు, కొడాలి నానికి ఓలుపల్లి రంగా ద్వారా పాత్ర ఉందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వంశీ పేర్కొన్నారు. గతంలో కాసినో వ్యవహారంలోనూ ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారని, చీకోటి ప్రవీణ్ తో తనకు, కొడాలి నానికి సంబంధంలేదని తెలిశాక తోక ముడిచారని విమర్శించారు.

More Telugu News