Anjali Sarvani: ఆస్ట్రేలియాతో సిరీస్ కు భారత మహిళల జట్టులో ఏపీ అమ్మాయి

  • టీమిండియాకు ఎంపికైన అంజలి శర్వాణి
  • ఈ నెల 9 ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్
  • ఐదు మ్యాచ్ లు ఆడనున్న భారత మహిళల జట్టు
  • అంజలి శర్వాణి స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని
  • అంజలి ఎంపికతో ఆదోనిలో సంబరాలు
Anjali Sarvani gets maiden call for Team India women squad for T20 Series against Australia

ఏపీకి చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. అంజలి శర్వాణి కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన యువ క్రికెటర్. అంజలి తండ్రి స్కూలు టీచర్ కాగా, తల్లి గృహిణి. ఆదోనిలోని మిల్టన్ హైస్కూల్ లో అంజలి టెన్త్ క్లాస్ వరకు చదివింది. 

క్రికెట్ పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తల్లిదండ్రులు, కోచ్ ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి, ఆపై టీమిండియాకు ఎంపికై తన కల నెరవేర్చుకుంది. పాతికేళ్ల అంజలి తన ఎడమచేతివాటం మీడియం పేస్ బౌలింగ్ లో సెలెక్టర్లను మెప్పించింది. 15 మందితో కూడిన టీమిండియా మహిళల బృందంలో చోటు దక్కించుకుంది. 

కాగా, తమ పట్టణానికి చెందిన అమ్మాయి భారత మహిళల సీనియర్ జట్టులో స్థానం సంపాదించడం పట్ల ఆదోనీ వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. అంజలి ఇంట సందడి వాతావరణం నెలకొంది. బంధుమిత్రులు, పట్టణవాసులు అంజలిని, ఆమె తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. 

ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఈ నెల 9 నుంచి 20 వరకు 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ముంబయిలోని వివిధ వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి.

More Telugu News