Jagga Reddy: కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ పరోక్ష సంకేతాలు ఇచ్చేసింది: జగ్గారెడ్డి

  • తెలంగాణను కుదిపేసిన లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర అంశం
  • కవిత, బీఎల్ సంతోషల్ ను అరెస్ట్ చేయాలన్న జగ్గారెడ్డి
  • వారిద్దరూ నేరగాళ్లేనని వ్యాఖ్యలు
Jaggareddy comments on Liquor Scam and MLAs issue

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కుంభకోణంలో బీజేపీకి చెందిన నేతలు ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని విమర్శించారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరగాళ్లేనని, వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారిని అరెస్ట్ చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందని అన్నారు. 

గత నెలరోజులుగా లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ రెండు స్కాంలు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్ట్ చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

బీజేపీ నేతలు తామే నీతిమంతులమని, అవినీతి అంటేనే తమకు భయమని అనేక డ్రామాలు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. నాడు యూపీఏ పాలన సందర్భంగా విపక్షంలో ఉన్న బీజేపీ అధికార కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒకవేళ బీఎల్ సంతోష్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని అన్నారు.

More Telugu News