Chandrababu: పోలవరం వెళుతున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం పిరికిపంద చర్య: చింతకాయల విజయ్

  • పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • పోలవరం సందర్శనకు ప్రయత్నం
  • నక్సల్స్ ముప్పు ఉందంటూ అడ్డుకున్న పోలీసులు
  • ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున పోరాడే స్వేచ్ఛ లేదా? అన్న విజయ్   
Chinatakayala Vijay condemns police halted Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే నక్సల్స్ ముప్పు ఉందంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తీవ్రంగా స్పందించారు. 

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబు గారిని పోలీసులు అడ్డుకోవడం పిరికి పంద చర్య అని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. "రాష్ట్ర ప్రజలకి ఏం జరుగుతుందో తెలియాలి? పోలవరం పాకిస్థాన్ లో ఉందా? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున పోరాడే స్వేచ్ఛ లేదా?" అంటూ ప్రశ్నించారు. తక్షణమే చంద్రబాబును ప్రాజెక్టు వద్దకు అనుమతించాలని చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు. 

"నాడు విశాఖపట్నంలో రుషికొండపై జరుగుతున్న తవ్వకాలను చంద్రబాబు గారు పరిశీలిస్తానంటే అడ్డుకున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తానంటే అడ్డుకుంటున్నారు. ఇవేమి చీకటి రాజకీయాలు? అక్రమాలు జరగకపోతే భయమెందుకు? తెలుగుదేశం ప్రభుత్వంలో 72 శాతం పనులు పూర్తి చేశాం కాబట్టే నాడు ప్రజలకి కూడా ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో చూపించాం. నేడు వైసీపీ ఎందుకు అడ్డుకుంటోంది?

పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ని నాశనం చేసింది నిజం కాదా? ఈ మూడున్నరేళ్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఎంత శాతం పూర్తి చేశారు... రివర్స్ టెండరింగ్ తో సాధించిందేంటి? నిర్వాసితులని ఇంకెన్నాళ్లు గాలికి వదిలేస్తారు? జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో పోలవరానికి ఇదేం ఖర్మ ?" అంటూ చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు.

More Telugu News