India Australia: డిసెంబర్ 29 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

  • చర్యలను అమల్లో పెట్టిన రెండు దేశాలు
  • ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు ద్వైపాక్షిక వాణిజ్యం
  • ఎక్కువగా లబ్ధి పొందనున్న ఆస్ట్రేలియా
  • మన దేశంలో కొత్తగా 10 లక్షల ఉపాధి అవకాశాలు
India Australia trade deal set to enter into force from Dec 29

భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసే కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది. ఇందు కోసం రెండు దేశాలు తమ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేశాయి. స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఇరు దేశాల మధ్య ఎటువంటి సుంకాల్లేకుండా, కొన్నింటిపై నామమాత్రపు టారిఫ్ లతో చేసుకునే వస్తు, సేవల ఎగుమతులు, దిగుమతులు. దీనివల్ల పలు రంగాల కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. తద్వారా ఆయా రంగాల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

ఎకనమిక్ కోపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ)ను అమలు చేయడానికి వీలుగా అన్ని చర్యలను అమల్లో పెట్టినట్టు ఆస్ట్రేలియాకు భారత్ తెలియజేసింది. దీన్ని ఆస్ట్రేలియా స్వాగతించింది. ఈ ఒప్పందంపై రెండు దేశాలు ఏప్రిల్ 2న సంతకం చేయగా.. చట్టపరమైన ఆమోదాలకు ఇంత సమయం తీసుకుంది. ఆస్ట్రేలియా గత వారమే పార్లమెంటు ఉభయసభల్లో దీనికి ఆమోదం తెలిపింది. 

డిసెంబర్ 29 నుంచి భారత్ కు దిగుమతి అయ్యే 85 శాతం ఆస్ట్రేలియా ఉత్పత్తులపై టారిఫ్ లు తొలగిపోతాయి. మరో 5 శాతం ఉత్పత్తులపై అధిక టారిఫ్ లను క్రమంగా ఎత్తేస్తారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 31 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నడుస్తోంది. ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వెళుతుందని భారత్ అంచనా వేస్తోంది. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2026-27 నాటికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. 10 లక్షలకు పైగా అదనపు ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

ఈ ఒప్పందం వల్ల ఆస్ట్రేలియా ఎగుమతి దారులకు ఏటా 2 బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది. దిగుమతులపై టారిఫ్ లు తొలగిపోవడం వల్ల వినియోగదారులకు, వర్తకులకు 500 మిలియన్ డాలర్ల మేర మిగులుతుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నది ఆస్ట్రేలియా కావడం గమనార్హం. ఆస్ట్రేలియా మన దేశానికి చేసే ఎగుమతులతో పోలిస్తే మన ఎగుమతులు సగం కూడా ఉండవు.  

More Telugu News