Nara Lokesh: ఎన్నికల విధులు మాత్రమే బోధనేతరమా?: నారా లోకేశ్

  • ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నించిన టీడీపీ లీడర్
  • మద్యం షాపుల ముందు కాపలా డ్యూటీ సంగతేంటని నిలదీత
  • ముఖ్యమంత్రి టూర్ లో బస్సుల కాపలా మాటేమిటని మండిపడ్డ లోకేశ్
nara lokesh responce on removing teachers from election duty

ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఈ నిర్ణయం వెనక ప్రభుత్వ పెద్దల దురాలోచన ఉందని విమర్శించింది. ముఖ్యమంత్రి ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. బుధవారం ఆయన ట్వీట్ చేశారు.

టీచర్లు నిర్వహించే బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నారని, మరి వాటి మాటేమిటని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రిని నిలదీశారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా? అంటూ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు.

బోధనేతర విధులకు ప్రభుత్వ ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తోంది. ఇతర విధుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై టీచర్లు శ్రద్ధ పెట్టలేకపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బోధనేతర విధులు అప్పగించొద్దంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే!  

More Telugu News