China: కొవిడ్ ఆందోళనలు బయటకు తెలియకుండా చైనా ఎలాంటి ప్లాన్ వేసిందంటే..!

  • చైనాలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
  • లాక్‌డౌన్‌లు ఎత్తివేయాలంటూ ప్రజల ఆందోళన
  • మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం ప్లాన్
  • ‘బాట్స్’ను ఉపయోగించి ట్విట్టర్‌ యూజర్ల దృష్టి మరలుస్తున్న ప్రభుత్వం
Chinese Bots Flood Twitter With Porn To Hide News Of Mass Anti Lockdown Protests

చైనాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన మొదలైంది. తొలి నుంచీ ‘జీరో కొవిడ్’ విధానాన్ని పాటిస్తున్న చైనా ఒక్క కేసు కనిపించినా ఆ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో ప్రతి రోజూ వేలాదిగా కేసులు వెలుగు చూస్తుండడంతో అప్రమత్తమైన చైనా పలు నగరాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇవి రెండు నెలలకుపైగా అమల్లో ఉన్నాయి. దీంతో సహనం నశించిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. అయితే, ఇందుకు మరో కారణం కూడా ఉంది.

10 మంది ప్రాణం తీసిన లాక్‌డౌన్
ఇటీవల షింజియాంగ్ ప్రావిన్సులోని ఉరుమ్కీ నగరంలోని ఓ నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం వద్ద కరోనా ఆంక్షలు ఉన్నందువల్లే ఇంట్లోని వారు తప్పించుకోలేకపోయారని, ఇంటి బయట గొలుసులతో తాళాలు వేయడం వల్ల బాధితులు బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారని ఆరోపించిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగిపోవాలని, లాక్‌డౌన్‌లు ఎత్తివేయాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇవి క్రమంగా ఇతర ప్రాంతాలకు పాకడంతో అక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

‘బాట్స్‌’ను వాడుకుంటున్న ప్రభుత్వం 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపడుతున్న ఈ ఆందోళనల గురించి ఇతర ప్రాంతంలోని ప్రజలు తెలుసుకోకుండా, నిరసనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజలు ట్విట్టర్‌లో ఏదైనా నగరం పేరు టైప్ చేసి సెర్చ్ చేయగానే చైనీస్ బాట్స్ అప్రమత్తం అయిపోతున్నాయి. అసభ్య కంటెంట్, పోర్న్, గాంబ్లింగ్ కంటెంట్‌ను చూపిస్తున్నాయి. ఒకసారి దానిపై క్లిక్ చేస్తే ఇక అందులోంచి బయటకు రావడం  యూజర్లకు కష్టం. ఫలితంగా అసలు విషయాన్ని పక్కనపెట్టి యూజర్లు అందులో మునిగిపోతున్నారు. షాంఘై, బీజింగ్.. ఇలా ఏ నగరం పేరును ట్విట్టర్‌లో టైప్ చేసినా సెక్స్ వర్కర్లు, పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తెరపైకి తెస్తూ యూజర్లను బాట్స్ పక్కదోవ పట్టిస్తున్నాయి. 

బయటపెట్టిన ‘వాషింగ్టన్ పోస్ట్’
నిరసనల నుంచి తమ పౌరుల దృష్టిని మళ్లించేందుకు చైనా చేస్తున్న ఈ ట్విట్టర్ మానిప్యులేషన్‌ను ‘వాషింగ్టన్ పోస్ట్’ బయటపెట్టింది. చైనా జర్నలిస్టు, టెక్నాలజీ, సెన్సార్‌షిప్ నిపుణుడైన మెంగ్యూడాంగ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. చైనాలోని ఏదైనా నగరం పేరును టైప్ చేయగానే వందలాదిగా పోర్న్ కంటెంట్ వచ్చిపడుతోందని ఆయన పేర్కొన్నారు.  

More Telugu News