Vistara: 2024 మార్చి నాటికి ఎయిరిండియాలో విస్తారా విలీనం పూర్తి

  • మరింత విస్తరించనున్న ఎయిరిండియా
  • విలీనానికి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అంగీకారం
  • రూ.2,042 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సింగపూర్ ఎయిర్ లైన్స్
  • బిలియన డాలర్ల సంస్థగా ఎయిరిండియా
Vistara set to merge in Air India

టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానయాన సంస్థ మరింతగా విస్తరించనుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్ లైన్స్ విలీనానికి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఐఏ) అంగీకరించాయి. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నట్టు వెల్లడించాయి. 

విలీనం పూర్తయితే ఎయిరిండియా-విస్తారా-ఎయిరిండియా ఎక్స్ ప్రెస్-ఎయిరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఏఐపీఎల్) లో టాటా సన్స్ వాటా 74.9 శాతం ఉంటుంది. అదే సమయంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25.1 శాతం ఉంటుంది. అంతేకాదు, విలీనం పూర్తయితే సింగపూర్ ఎయిర్ లైన్స్ రూ.2,042 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఎయిరిండియా విలువ రూ.8,169 కోట్లకు చేరనుంది. 

దీనిపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ స్పందిస్తూ, ఎయిరిండియాలో విస్తారా విలీనం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఎయిరిండియాని అసలుసిసలైన ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా మలచడంలో ఇదొక కీలక ఘట్టం అని అభివర్ణించారు. 

అటు, సింగపూర్ ఎయిర్ లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ మాట్లాడుతూ, భారత్ లోని గౌరవనీయ సంస్థల్లో టాటా సన్స్ ఒకటని, 2013లో తాము సంయుక్తంగా విస్తారాను ఏర్పాటు చేసి మార్కెట్లో అగ్రగామిగా నిలిచామని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే విస్తారా అనేక ఘనతలు సొంతం చేసుకుందని వివరించారు. విలీనం ద్వారా టాటా గ్రూప్ తో తమ భాగస్వామ్యం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని తెలిపారు.

More Telugu News