YS Sharmila: షర్మిల కారులో ఉండగానే... ఆ కారును లాక్కెళ్లడం దారుణం: కిషన్ రెడ్డి

  • కారులో ఉండగానే షర్మిలను స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • ఘటనపై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
  • మహిళపై కేసీఆర్ తన అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శ
kishan reddy angry over ts government over ys sharmila arrest

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల యత్నించగా.. పంజాగుట్ట సర్కిల్ లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కారు నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించగా...షర్మిల కారులో ఉండగానే... ఆ కారును పోలీసులుు క్రేన్ ద్వారా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

షర్మిల వున్న కారును క్రేన్ తో పోలీసులు తరలిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కిషన్ రెడ్డి... ఓ మహిళ అని కూడా చూడకుండా షర్మిలను... కారులో ఉండగానే... ఆ కారును క్రేన్ తో లాక్కెళ్లడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఈ చర్యను తాను ఖండిస్తున్నానన్న కిషన్ రెడ్డి... విపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్ కు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.

More Telugu News