Telangana: తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

  • గోల్కొండ కోటలోని మెట్లబావి, దోమకొండకు అవార్డులు
  • భారత్‌కు మొత్తం నాలుగు అవార్డులు
  • ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు అవార్డులు
golkonda metal bavi and domakonda fort won unesco awards

తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’ కేటగిరీలో, దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. అలాగే, ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ లభించగా, దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ లభించాయి. 

ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు అందగా, చివరికి ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలను ఐదు కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి.

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. ఆ తర్వాత వర్షాలకు సగభాగం కూలిపోయింది. 2013లో ఈ బావి పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ చొరవతో పునరుద్ధణ జరిగింది. ప్రస్తుతం ఈ బావిలో ఊట వస్తోంది. 

దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇందులో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ కోట నిర్వహణ సినీ నటుడు చిరంజీవి వియ్యంకుడు కామినేని అనిల్ కుమార్ అధీనంలో వుంది. రామ్ చరణ్, కామినేని అనిల్ కుమార్తె ఉపాసన వివాహం ఇక్కడే జరిగింది.

More Telugu News