Botsa Satyanarayana: ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సి వస్తుంది: మంత్రి బొత్స

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మహాసభ
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ
  • ముఖ్య అతిథులుగా బొత్స, ఆదిమూలపు
Botsa opined any corruption in govt leads employees and CM have to hang their heads down

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభ నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. 

మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, ముఖ్యమంత్రి తలదించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే తమ ప్రభుత్వంలో ఆ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు, సీఎం తలదించుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. 

ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని బొత్స అన్నారు. ఏ అంశం అయినా కూర్చుని పరిష్కరించుకోవాలన్నదే తన విధానం అని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ సహా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చించి పరిష్కరిస్తామని బొత్స హామీ ఇచ్చారు. 

అవసరమైతే కాళ్లు పట్టుకుని అయినా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని అన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయాన్ని అవలంబించడం సరికాదని హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని తెలిపారు. 

మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయాల్లో 500కి పైగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు స్వచ్ఛమైన సర్వీస్ రూల్స్ తో పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. ప్రమోషన్లు ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని అన్నారు. శానిటేషన్ ఉద్యోగులకు త్వరలోనే వారాంతపు సెలవు మంజూరు చేస్తామని మంత్రి ఆదిమూలపు వివరించారు.

More Telugu News