Revanth Reddy: నన్ను వ్యతిరేకించేది ఆ నలుగురైదుగురే.. మిగతా వాళ్లంతా నా వెంటే: రేవంత్ రెడ్డి

  • వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తామని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ట్రస్టు ఆస్తులను శశిధర్ రెడ్డి కాజేశారని, లెక్క అడిగితే పార్టీ వీడారని ఆరోపణ
  • విజయారెడ్డి చేరినందుకే దాసోజ్ శ్రావణ్ పార్టీని వీడారన్న రేవంత్
revanth reddy comments on congress seniors

కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశిస్తున్ననలుగురు వ్యక్తులు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. వాళ్లు తప్ప మిగతా వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని అన్నారు. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటామని, ఫలితం తేడాగా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యారనడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలను మర్రి శశిధర్‌రెడ్డి స్వాహా చేశారని, వాటి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని ఆరోపించారు. డిసెంబరు మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని నియమించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన ఆయన, పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏ రోజైనా రోడ్డెక్కారా? అని ప్రశ్నించారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ విచారణను ఖండిస్తూ వేలాది మంది పార్టీ కార్యకరలు ధర్నాలు చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. శశిధర్ రెడ్డి కొడుకు ఆదిత్యరెడ్డి తన తండ్రి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని 2018లో కోదండరాం పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. ఇక, దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ ను వదిలివెళ్లారని చెప్పారు. ఎమ్మెల్సీ ఇస్తామని, సర్వేలు చేయించి అనుకూలంగా ఉంటే ఖైరతాబాద్‌ టికెట్‌ కూడా ఇస్తామని ఏఐసీసీ నేతలు చెప్పినా వినిపించుకోలేదన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడినయ్యాక 30 మందికిపైగా పార్టీలో చేరారని, పార్టీ నుంచి వెళ్లిపోయింది ముగ్గురు నాయకులే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News