Anitha: ప్రజల సొమ్ముతో జగన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలేంటి రోజా?: వంగలపూడి అనిత

  • 51వ పడిలోకి సీఎం జగన్
  • నగరిలో రోజా చీటీ చిరిగిపోయిందని విమర్శలు
  • అందుకే జగన్ పుట్టినరోజు అంటూ డ్యాన్సులేస్తోందని వ్యాఖ్యలు
Vangalapudi Anitha take a swipe at minister Roja

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడని మంత్రి రోజా పర్యాటకశాఖ పేరుతో చేస్తున్న డ్యాన్సులు, ఉత్సవాల పేరుతో రూ.2 కోట్ల ప్రజల సొమ్ము తగలేస్తున్న తీరు చూస్తుంటే, ప్రజలంతా మూకుమ్మడిగా ఇదేం ఖర్మరా మాకు అంటున్నారని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రూ.2 కోట్ల ఖర్చుతో పుట్టినరోజు చేయడానికి జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని నిలదీశారు. 

వంగలపూడి అనిత నేడు జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. “జగన్ రెడ్డి 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంటే, పర్యాటకశాఖ పేరుతో ఉత్సవాలు నిర్వహించడమేంటమ్మా రోజా?  మీ నాయకుడు ఏం ఘనకార్యం చేశాడని జనం సొమ్ము రూ.2 కోట్లు తగలేసి మరీ ఉత్సవాలు చేస్తున్నావు. పదోతరగతి ప్రశ్నపత్రాలు దొంగిలించాడనా... లేక 16 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చాడనా...! లేక బాబాయ్ ని చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టినందుకా?

రాష్ట్రంలోని మహిళలు, యువతులు మాన, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నందుకు రోజా ఉత్సవాలు చేస్తున్నారా? జగన్ రెడ్డి రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఊడపెరికాడని ఆయన పుట్టినరోజులు చేస్తున్నారు?" అంటూ అనిత నిప్పులు చెరిగారు. 

"రోజా తన నాయకుడి డప్పుకొట్టి, ఆయన మెప్పు పొందాలంటే సొంత సొమ్ముతో సంబరాలు చేస్తే ప్రజలు హర్షించేవారు. తన నియోజకరవర్గంలో రోజా చీటీ చిరిగిపోయింది కాబట్టే, జగన్ మెప్పు కోసం ఉత్సవాల పేరుతో డ్యాన్సు లేస్తోంది. పర్యాటక శాఖ ఉద్యోగులకు నెలనెలా జీతాలు లేక అల్లాడిపోతుంటే, ప్రజల సొమ్ముతో జగన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో స్వర్ణోత్సవాలు చేయడమేంటి రోజా?

వైసీపీకి 151 స్థానాలిచ్చింది జనం సొమ్ముతో జల్సాలు, ఉత్సవాలు చేసుకోవడానికి కాదు. ఎప్పుడు బయటకు వచ్చినా ప్రజలకు ముఖం కనిపించకుండా పరదాలు అడ్డుపెట్టుకొని బటన్లు నొక్కివెళ్లిపోయే ముఖ్యమంత్రికి పుట్టినరోజు సంబరాలు అవసరమా? 51 ఏళ్లు వచ్చాక జగన్ రెడ్డికి పుట్టినరోజు సంబరాలు కావాలా? 

తనకు పబ్లిసిటీ, ప్రమోషన్లు కావాలంటే రోజా మరలా జబర్దస్త్ కు వెళ్లొచ్చు. అంతే గానీ జనం సొమ్ముతో తమ నాయకుడిని ఎంతగా లేపాలని చూసినా, ప్రజలు లేవలేని విధంగా ఆయన్ని కప్పెట్టేస్తారని టూరిజం మంత్రి తెలుసుకుంటే మంచిది” అన్నారు అనిత. కాగా, సీఎం జగన్ డిసెంబరు 21న పుట్టినరోజు జరుపుకోనున్నారు.

More Telugu News