BJP: గుజరాత్ ఎన్నికలు... భారీ హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల

  • అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో
  • ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న బీజేపీ
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ
BJP Gujarat elections manifesto

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాసేపటి క్రితం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రజలకు భారీ హామీలను బీజేపీ గుప్పించింది. అయితే ఉచితాలకు పెద్ద పీట వేయకపోవడం గమనార్హం. అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపింది. గాంధీనగర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే:

  • 2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు గాను గుజరాత్ ఒలింపిక్ మిషన్ ప్రారంభిస్తాం
  • ఉగ్రముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు యాంటీ రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు
  • ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
  • మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
  • వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు
  • విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల స్కూళ్ల అభివృద్ధి
  • ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
  • మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
  • ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం
  • ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు
  • బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు

డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ 77 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే, ఎన్నికల అనంతరం 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

More Telugu News