Visakhapatnam: విశాఖ ట్రాఫిక్ పోలీసుల రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు.. పోలీసుల వివరణ ఇదీ!

  • ఆటోలకు జారీ చేసే రసీదులపై ఏసు బోధనలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
  • పోలీసులను నిలదీసిన బీజేపీ నేతలు
Jesus Christ on Visakha Traffic Police Recipts

విశాఖపట్టణం ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఆటో రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉండడం వివాదానికి కారణమైంది. ఇక్కడి రైల్వే స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి. పోలీసులు తమకు జారీ చేసిన రసీదులను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

విషయం తెలిసిన బీజేపీ నేతలు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పోలీసులు స్పందిస్తూ తమ వద్ద రసీదులు అయిపోవడంతో తమకు ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు. అయితే, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు. 

కాగా, గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు వారి సంస్థల పేరుతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లు లేకపోవడం గమనార్హం.

More Telugu News