CPI Narayana: ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు: రుషికొండ వద్ద సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

  • విశాఖలో రుషికొండను సందర్శించిన నారాయణ
  • రుషికొండ స్వరూపమే మార్చివేశారని ఆగ్రహం
  • ఇంకెన్ని వందల కోట్లు పెట్టినా దాని రూపం రాదని వ్యాఖ్య 
CPI Narayana fires on AP Govt over Rishikonda issue

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేడు విశాఖలోని రుషికొండను సందర్శించారు. ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికేపోదని అన్నారు. ఇంకెన్ని వందల కోట్లు ఖర్చు చేసినా రుషికొండకు సహజసిద్ధ స్వరూపం రాదని తెలిపారు. టెంకాయకు చుట్టూ పీచు తీసి, పైన పిలక మిగిల్చిన మాదిరిగా రుషికొండ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఓ రిసార్ట్ కోసం రుషికొండ రూపురేఖలు మార్చివేయడం ఎంత అన్యాయం? అని నారాయణ ఆక్రోశించారు. కావాలంటే విశాఖపట్నం, అనకాపల్లిలో ఇంకెక్కడైనా రిసార్టులు కట్టుకోవచ్చుగా? అని హితవు పలికారు. రుషికొండను నాశనం చేయడం అంటే సహజసిద్ధమైన పర్యావరణాన్ని రేప్ చేసినట్టే లెక్క అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం ఎంత ఘోరమో అంతకుమించి ఈ ప్రభుత్వం పర్యావరణంపై ఘాతుకానికి పాల్పడిందని నారాయణ మండిపడ్డారు. 

చట్టప్రకారం విలాసవంతమైన భవనాలు కడుతున్నప్పటికీ, అందుకోసం కొండను తొలిచివేయడం నేరం అని వ్యాఖ్యానించారు. కాగా రుషికొండ సందర్శనకు తాను మూడు నెలల కిందట హైకోర్టును ఆశ్రయించానని, అనుమతి లభించలేదని, మళ్లీ ఇప్పుడు కోర్టుకు వెళితే అనుమతి వచ్చిందని తెలిపారు.

More Telugu News