tdp: నా యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారు.. ఎమ్మెల్యే తోపుదుర్తిపై పరిటాల సునీత ఆగ్రహం

  • పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డ టీడీపీ నేత
  • చెక్ పోస్టులతో రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపణ
  • రాప్తాడు మండలంలో కొనసాగుతున్న సునీత పాదయాత్ర
TDP Leader Paritala Sunitha Fires on YCP MLA Thopudurthy Prakash Reddy

రైతుల కోసం తెలుగుదేశం పేరుతో ఆ పార్టీ నాయకురాలు పరిటాల సునీత చేపట్టిన పాదయాత్ర రాప్తాడు మండలంలో కొనసాగుతోంది. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను పూర్తి చేసుకుని, ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే, తన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సునీత ఆరోపించారు. 

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యాత్రలో పాల్గొనకుండా రైతులను అడ్డుకోవడానికి చెక్ పోస్టులు పెట్టి మరీ ఎక్కడికక్కడే ఆపేస్తున్నారని ఆరోపించారు. 

ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రైతులకు మేలు జరగడం కోసం చేపట్టిన తన పాదయాత్రను ఆపేది లేదని సునీత స్పష్టంచేశారు. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లడానికీ సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తిని పరిటాల సునీత హెచ్చరించారు. త్వరలోనే ఎమ్మెల్యే బాగోతం బయటపెడతానని చెప్పారు.

రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడమే తప్ప ఎమ్మెల్యే తోపుదుర్తి చేసిందేమీ లేదన్నారు. జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ఉందా? అని తోపుదుర్తికి సునీత సవాల్ విసిరారు. మరోవైపు, రాప్తాడులో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదేమని, ఇక్కడి అక్రమాలు ఆయనకు కనిపించడంలేదా? అని సునీత ప్రశ్నించారు.

More Telugu News