Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ లో ప్రమాదం... ఆసుపత్రిపాలైన మహిళా రేసర్

  • హైదరాబాదులో కార్ రేసింగ్
  • నిన్నటి నుంచి పోటీలు
  • నేడు రెండు రేస్ కార్లు ఢీ
  • మహిళా రేసర్ కు గాయాలు
Woman racer injured in Indian Racing League

హైదరాబాద్ లో నిన్నటి నుంచి ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు కూడా పోటీలు జరగ్గా, ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ మహిళా రేసర్ గాయపడింది. ఎన్టీఆర్ మార్గ్ రేసింగ్ సర్క్యూట్ లో కార్లు దూసుకుపోతుండగా, చెన్నై టర్బో రైడర్స్ టీమ్ కు చెందిన కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. గాయపడిన మహిళా రేసర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

కాగా, కార్ రేసింగ్ అంటే ఎంతో రిస్క్ తో కూడుకున్నది. రేసర్లే కాదు, చూసే ప్రేక్షకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే, హైదరాబాదులో ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా రేసింగ్ ట్రాక్ చుట్టూ 15 అడుగుల మేర ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఒకవేళ రేసు కారు అదుపు తప్పినా బయటికి దూసుకురాకుండా ఈ ఇనుప కంచె నిలువరిస్తుంది. అంతేకాదు, రేసింగ్ ట్రాక్ లో ప్రతి మలుపు వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అంబులెన్స్ లను, వైద్యులను, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

ఐఆర్ఎల్ పోటీలను త్వరలో జరిగే ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కు ట్రయల్ రన్ గా  భావిస్తున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళా రేసర్లు కూడా పాల్గొనడమే కాదు, గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు.

More Telugu News