Pawan Kalyan: మేం స్కూలుకు వెళుతుంటే రమీజాబీకి న్యాయం చేయాలని గోడలపై రాసుండేది: పవన్ కల్యాణ్

  • నేడు ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి 
  • జనసేన కార్యాలయంలో ఘనంగా వేడుకలు
  • వీర మహిళలనుద్దేశించి పవన్ ప్రసంగం
Pawan Kalyan speech in Janasena office

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఝాన్సీ లక్ష్మీబాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జనసేన వీర మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. 

మాతృభూమి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం మనకు స్ఫూర్తి అని, లక్ష్మీబాయి స్ఫూర్తిని వీర మహిళలు పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎంతటి రాక్షసుడినైనా శక్తి స్వరూపిణి అంతం చేయగలదని, అందుకే జనసేన మహిళా విభాగానికి వీర మహిళ విభాగం అని నామకరణం చేశామని వెల్లడించారు. 

నుదుట కుంకుమ పోయినా ఫర్వాలేదు, ధైర్యం కోల్పోవద్దని చెప్పి ఖడ్గ తిక్కనను యుద్ధానికి పంపిన ఆయన భార్య, తల్లి వంటి మహిళలను జనసేన పార్టీ స్ఫూర్తిదాయకంగా పరిగణిస్తుందని పవన్ కల్యాణ్ వివరించారు. 

"రాజకీయ నాయకులు అంటే గొంతేసుకుని పడిపోవడం, నోటికొచ్చినట్టు తిట్టడం కాదు. విద్యావంతులు, పాలనాపరమైన, విధానపరమైన పాలసీలపై అవగాహన ఉన్నవాళ్లు, పోరాటం చేయగల సత్తా ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలి. అలాంటి వాళ్లు సగటు కుటుంబాల నుంచే వస్తారు. 

అప్పట్లో మేం చదువుకునే రోజుల్లో రమీజాబీ రేప్ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. మేం స్కూల్ కు వెళుతుంటే దారిలో గోడలపై రమీజాబీకి న్యాయం చేయాలి అని రాసుండేది. రమీజాబీకి న్యాయం చేయాలని ముక్తకంఠంతో కోరారు. ప్రస్తుతం రాజకీయనేతలు బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు. ఒకట్రెండ్ మానభంగాలు జరిగినా పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ఆలోచనా ధోరణిని మనం మార్చాలి. 

సుగాలీ ప్రీతిపై అఘాయిత్యం చేసి హత్య చేశారు. దివ్యాంగురాలైన ఆమె తల్లి ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా సమాజంలో చలనం లేకుండా పోయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News