Bandhavi Sridhar: మూవీ రివ్యూ: 'మసూద'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'మసూద'
  • ప్రధానమైన పాత్రను పోషించిన బాంధవి శ్రీధర్ 
  • కీలకమైన పాత్రలో కనిపించిన సంగీత 
  • తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో భయపెట్టే సినిమా
  • ప్రధానమైన బలంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కెమెరా పనితనం  
Masooda Movie Review

తెలుగు తెరకి హారర్ థ్రిల్లర్ చిత్రాలు కొత్తేమీ కాదు. అయితే తెలుగులో నేరుగా వచ్చే హారర్ థ్రిల్లర్ సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇతర భాషల నుంచి ఈ జోనర్లో వచ్చే సినిమాలే ఎక్కువ. భాష ఏదైనా కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సారి మాత్రం తెలుగులోనే రూపొందిన హారర్ థ్రిల్లర్ ను థియేటర్లలో వదిలారు .. ఆ సినిమానే 'మసూద'. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ రోజునే విడుదలైన ఈ సినిమా, ఈ తరహా జోనర్లోని సినిమాలను ఇష్టపడేవారికి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

సాధారణంగా సినిమా కథల్లోని దెయ్యాలు పగబడుతూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో ఆ ప్రేతాత్మ శక్తి బయటికి వస్తుంది. తనకి అందుబాటులోకి వచ్చినవారిని ఆ ప్రేతాత్మ ఆవహిస్తుంది. ఆ శరీరాన్ని అడ్డుపెట్టుకుని తన చావుకు కారణమైనవారిని చంపుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇక అలాంటి ప్రేతాత్మను బంధించడానికి క్షుద్ర మాంత్రికులు రంగంలోకి దిగడం .. ఆ ప్రేతాత్మను తమ అధీనంలోకి తీసుకుని రావడానికి వారు నానా హడావిడి చేయడం మామూలే. 'మసూద' కథ కూడా ఈ అంశాలను టచ్ చేస్తూనే వెళుతుంది. మరి ఇక కొత్తదనం ఎక్కడ ఉంది? అంటే ట్రీట్మెంటులో ఉందని చెప్పాలి.

 నీలం ( సంగీత) భర్త అబ్దుల్ (సత్య ప్రకాశ్) తో గొడవల కారణంగా అతనికి దూరంగా ఉంటూ ఉంటుంది. పెళ్లీడు కొచ్చిన కూతురు నాజియా (బాంధవి శ్రీధర్) తో కలిసి ఒక ఫ్లాట్ లో ఉంటూ ఉంటుంది. ఒక స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటుంది.  ఆ పక్కనే ఉన్న మరో ఫ్లాట్ లో గోపీ (తిరువీర్) ఉంటూ ఉంటాడు. అతను ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అదే సంస్థలో పనిచేస్తున్న మినీ (కావ్య)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నీలం కుటుంబానికి గోపి అండగా నిలబడుతూ ఉంటాడు. 

ఒక రోజు రాత్రి నాజియా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉండటంతో, నీలం వెళ్లి గోపీని తన ఫ్లాటుకి పిలుచుకువస్తుంది.  నాజియాకి దెయ్యం పట్టి ఉంటుందని భావించిన గోపీ, ఆ మరునాడే నీలంను తీసుకుని అల్లా ఉద్దీన్ ను కలుస్తాడు. దుష్ట శక్తులను వదిలించే అతను, ఒక తాయెత్తును ఇచ్చి నాజియాకి కట్టమంటాడు. అలా నీలం కట్టిన తాయెత్తును నాజియా తెంపేస్తుంది. దాంతో పరిస్థితి విషమిస్తుంది. నాజియాకి పట్టిన దెయ్యం సామాన్యమైనది కాదని భావించిన అల్లా ఉద్దీన్, వాళ్లను వెంటబెట్టుకుని తన గురువైన బాబా (శుభలేఖ సుధాకర్) దగ్గరికి తీసుకుని వెళతాడు. 

దాంతో నాజియా కోసం నీలం ఫ్లాటుకి వచ్చిన బాబా అక్కడ క్షుద్ర శక్తి ఉందని గ్రహిస్తాడు. 'మసూద' పేరు కలిగిన ప్రేతాత్మ నాజియాను ఆవహిచిందని తెలుసుకుంటాడు. మసూద ఎవరు? ఎవరిపై పగతో రగిలిపోతోంది?  ప్రేతాత్మ శక్తి ఏ స్థాయిలో ఉంది? అనే విషయాలను తెలుసుకోవడానికిగాను ఆయన రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఆయనకి తెలిసే నిజాలు ఏమిటి? మసూద ప్రేతాత్మను బంధించడానికి ఆయన చేసే ప్రయత్నాలకు ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి? అనేదే కథ.

దర్శకుడు కథను అల్లుకున్న తీరు .. కథానాన్ని నడిపించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. 1989లో ఈ కథ చిత్తూరు ప్రాంతంలో మొదలవుతుంది. కథ మొదలైన కొంతసేపటి వరకూ తెరపై ఏం జరుగుతుందనే విషయం అర్థం కాదు. మొత్తానికి ఏదో జరగబోతోందనే విషయం మాత్రం నిదానంగా అవగతమవుతుంది. అలా ఇంటర్వెల్ వరకూ అక్కడక్కడా భయపడుతూ నడిచిన కథ, అక్కడి నుంచి ఊపందుకుంటుంది. 'మసూద'కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సెకండాఫ్ లోనే ఉంటుంది. అది ఆడియన్స్ ను భయపెడుతూ ముందుకు సాగుతుంది. 

ఇక ఒక శక్తిమంతమైన ప్రేతాత్మను కట్టడి చేయాలంటే .. బంధించాలంటే, అందరూ కూడా ముందుకు వేసుకున్న ప్లాన్ ప్రకారం పెర్ఫెక్ట్ గా పనిచేయాలి. ఎక్కడ ఎలాంటి తేడా జరిగినా దాని చేతిలో అంతా అయిపోతారు. అలాంటి ఒక టెన్షన్ వాతావరణంలో చిత్రీకరించిన క్లైమాక్స్ ఉత్కంఠను రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. దర్శకుడు కథకు తగిన ముగింపును ఇవ్వడమే కాకుండా., సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చి మరీ వదిలాడు. 

హారర్ థ్రిల్లర్ సినిమాలకి కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలం. నాగేశ్ ఫొటోగ్రఫీ .. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ప్రేతాత్మకి సంబంధించిన సన్నివేశాలను .. ఫారెస్టు నేపథ్యంలో దృశ్యాలను నాగేశ్ గొప్పగా చిత్రీకరించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి ప్రేక్షకుడిని కూడా ఒక పాత్రగా చేసి తెరపై జరిగే సన్నివేశంలో నిలబెడుతుంది. టేకింగ్ పరంగా ఈ సినిమాకి ఫస్టు మార్కులు ఇవ్వొచ్చు. శుభలేఖ సుధాకర్ .. సంగీత .. తిరువీర్ .. కావ్య .. ఇలా ఎవరి పాత్ర పరిధిలో వారు న్యాయం చేశారు. ఇక ఇక గుంటూరు అమ్మాయి బాంధవి శ్రీధర్ పోషించిన ప్రేతాత్మ పాత్రనే ఈ సినిమాలో కీలకం. ఇదే ఫస్టు సినిమా అయినప్పటికీ గొప్పగా చేసింది. అందంగా కనిపిస్తూనే భయపెట్టేసింది. 

అరబిక్ స్టైల్లో 'మసూద' అనే తెలుగు టైటిల్ ను డిజైన్ చేయడంతోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇంతకుముందు ఇంతకంటే గొప్ప హారర్ థ్రిల్లర్ సినిమాలు తెలుగు తెరపై చూసి ఉండొచ్చు. కానీ ఎక్కడా ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా, చాలా తక్కువ బడ్జెట్ లో .. స్టార్ డమ్ లేని తక్కువ పాత్రలతో .. కేవలం కంటెంట్ తోనే ఈ స్థాయిలో భయపెట్టగలగడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలి. ఒకటి రెండు చోట్లా తెరపై కాస్త బ్లడ్ ఎక్కువగా కనిపించిన షాట్స్ ను పక్కనే పెడితే, ఆడియన్స్ ను భయపెట్టే ఉద్దేశంతోనే వచ్చిన 'మసూద' ప్రయత్నం ఫలించినట్టేనని చెప్పుకోవచ్చు.

More Telugu News