Sajjala Ramakrishna Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్పందన

  • బీజేపీ ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందన్న కేసీఆర్
  • ఆ ఉచ్చులో తాము పడబోమన్న సజ్జల
  • సీఎ జగన్ కు వాటిపై ఆసక్తేలేదని వెల్లడి
  • రాష్ట్ర అభివృద్ధి తమ అజెండా అని స్పష్టీకరణ
Sajjala reacts to CM KCR comments

తెలంగాణ ప్రభుత్వాన్నే కాకుండా పొరుగునే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని, తెలంగాణ రాజకీయ పరిస్థితుల కోణంలో కేసీఆర్ మాట్లాడి ఉంటారని సజ్జల పేర్కొన్నారు. 

అయినప్పటికీ, వారి ఉచ్చులో తాము పడబోమని స్పష్టం చేశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతోనే పనిచేస్తుందని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల గురించి పట్టించుకోబోమని సజ్జల తేల్చి చెప్పారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలు వారి రాష్ట్రానికే పరిమితం అని అన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చే ఆసక్తి సీఎం జగన్ కు కూడా లేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని సీఎం జగన్ ఇటీవల విశాఖలోనూ చెప్పారని గుర్తుచేశారు. 

ప్రజలు ఐదేళ్లు తమకు అవకాశం ఇచ్చారని, ఈ ఐదేళ్లలో శక్తిమేర పనిచేసి మెప్పించి ప్రజా దీవెనలు కోరతామని వెల్లడించారు. ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారం ఎత్తుగడ రాజకీయం అని సజ్జల కొట్టిపారేశారు. హడావుడిగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ఇక, చంద్రబాబు తనకు చివరి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరవని, నాయకుడుగా ఆయన తమకు ఎంత పనికొస్తాడన్నదే ప్రజలు ఆలోచిస్తారని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏడుస్తున్నాడని ఆయనపై జాలి చూపడం అనేది ఉండదని అన్నారు. చంద్రబాబు ఇకనైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.

More Telugu News