Chandrababu: నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదివాను... జగన్ ఎక్కడ చదువుకున్నాడు?: చంద్రబాబు

  • కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • ఆదోనిలో రోడ్ షో
  • భారీగా తరలివచ్చిన జనం
  • ఉద్వేగంతో ప్రసంగించిన టీడీపీ అధినేత 
  • తప్పు జరిగిపోయిందని జనం బాధపడుతున్నారని వెల్లడి
Chandrababu road show in Adoni

కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. నేడు ఆదోనిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "నేనేమీ సినిమా యాక్టర్ కాదు... నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టీడీపీ రావాలి అని సంఘీభావం తెలిపేందుకు వీరంతా వచ్చారు" అంటూ ఉద్వేగం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడని,    అన్నీ ఆపేశాడని, అభివృద్ది నిలిపివేశాడని విమర్శించారు. ఒక పెళ్లి చేయాలంటే ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం, కానీ నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయాం అని పేర్కొన్నారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. 

"మూడున్నరేళ్లలో అభివృద్ది ఆగిపోయింది... రౌడీయిజం పెరిగిపోయింది... దోపిడీ, నేరాలు పెరిగిపోయాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. రౌతుకొద్దీ గుర్రం అంటారు... అందుకే పోలీసులు ఇలా అయ్యారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. పోలీసులకు జీతాలు రావడం లేదు....మీ పిల్లలూ నష్టపోయారు. నా కర్నూలు పర్యటనలో వైసీపీ చోటానేతలు వేషాలు వేస్తే... పోలీసులు చూస్తూ కూర్చున్నారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే నాకు బాధ్యత లేదు... ఆపై మీ ఇష్టం!" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిని ఏమనాలి? మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా పన్ను వేస్తోంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇసుక దొరుకుతోందా?.... ఈ ఊళ్లో ఇసుక కర్నాటక, హైదరాబాద్లో దొరుకుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా... ఉంటే ఏం చేస్తున్నారు? సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. మద్యం మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారు. తయారీ ఆయనే... అమ్మకం ఆయనే.  ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి....కర్నూలులో బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్!

ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు... నకిలీ విత్తనాలతో పత్తిరైతులను ముంచారు. నాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని భయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా భయపడ్డారు. కానీ నేడు ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు. వైసీపీ నేతలు ఖనిజ సంపద దోచేస్తున్నారు.....భూకబ్జాలు చేస్తున్నారు. చుక్కల భూమి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ప్రజలు తమ భూములు ఉన్నాయో పోయాయో చూసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. 

"పవన్ కళ్యాన్ విశాఖపట్నం పోతే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట! రేపు మేము కూడా వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా...ఫ్లైవోవర్ లు కట్టలేమా? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ చానల్స్ ను ఉన్మాది జగన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను ఆరోజు ఇలా చేసి ఉంటే సాక్షి టివి, సాక్షి పేపర్ వచ్చేదా? 

తెలుగుదేశం బీసీల పార్టీ. వారికి నేను అండగా ఉంటా. వాల్మీకి, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను ప్రభుత్వంలోకి వచ్చాక ఆదుకుంటాను. యవతకు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం...! కానీ నేను రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాను. 

యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారు. సమాజాన్ని జగన్ రెడ్డి చెడగొడుతున్నాడు. సంక్షేమం నిలిపివేస్తాను అని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తాను. బుద్ది ఉన్న సిఎం ఎవరైనా కలెక్టరేట్ లు, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెడతారా? నా అనుభవం ఉన్నంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు! నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశాను. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడు?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

More Telugu News