Etela Rajender: తిరిగి టీఆర్​ఎస్​ లోకి వెళ్తున్నారన్న ప్రచారంపై స్పందించిన ఈటల రాజేందర్

  • ప్రచారాన్ని ఖండించిన బీజేపీ నేత
  • అది పచ్చి అబద్ధమని వ్యాఖ్య
  • ఇదంతా సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శ 
Etala Rajender denies rumors that he is going back to TRS


బీజేపీ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇది సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు. 

టీఆర్ఎస్ లో తాను 20 ఏళ్లు పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదని తెలిపారు. 2015 నుంచి ఆ పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల తెలిపారు. టీఆర్ఎస్ ను తాను వీడలేదని... సీఎం కేసీఆర్ తనను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని చెప్పారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్ కే ఎక్కువ తెలుసని ఈటల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు.

More Telugu News