Andhra Pradesh: హైదరాబాద్ లో భారీగా పెరిగిన చలి.. ఏపీలో కూడా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  • తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి
  • హైదరాబాద్ రాజేంద్రనగర్ లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
  • అరకులో 11 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
Temperatures in Hyderabad dropped

తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ లో సైతం చలి వణికిస్తోంది. పగటి వేళల్లో వేడిగా ఉంటున్నప్పటికీ... రాత్రి పూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ఉదయం పూట మంచు కూడా కురుస్తోంది. చలి తట్టుకోలేక ప్రజలు వణికిపోతున్నారు. కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ లో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల జిల్లాలో 9.9, ఆదిలాబాద్ జిల్లాలో 10.5, నిర్మల్ జిల్లాలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.      

మరోవైపు ఏపీలో సైతం చలి ప్రతాపం చూపుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అరకులో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.

More Telugu News