Uttar Pradesh: 45 సంవత్సరాల తర్వాత తొలిసారి.. రాంపూర్‌లో ఎన్నికలకు ఆజంఖాన్ కుటుంబం దూరం

  • 1977 తర్వాత తొలిసారి రాంపూర్‌లో ఎన్నికకు దూరమైన ఆజంఖాన్ కుటుంబం
  • ఉప ఎన్నికలో ఆజంఖాన్ సన్నిహితుడు అసీం రజాను బరిలోకి దింపిన సమాజ్‌వాదీ పార్టీ
  • 1977-2022  మధ్య పదిసార్లు విజయం సాధించిన ఆజం ఖాన్
No Azam Khan Family Member In Rampur Poll Contest

విద్వేష వ్యాఖ్యల కేసులో దోషిగా మారిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ తన శాసన సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ స్థానానికి డిసెంబరు 5న ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో విశేషం ఏమీ లేకపోయినా.. ఈ ఎన్నికలో ఆజంఖాన్ కుటుంబం నుంచి ఎవరికీ బరిలోకి దిగడం లేదు. రాంపూర్‌లో ఆజంఖాన్ కుటుంబం బరిలోకి దిగకపోవడం 1977 తర్వాత అంటే 45 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 


సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆజంఖాన్ భార్య తజీన్ ఫాతిమాకు కానీ, ఆయన కోడలికి కానీ టికెట్ ఇవ్వలేదు. ఆజంఖాన్‌ సన్నిహితుడు అసీంరజాకు టికెట్ కేటయించింది. 1977 నుంచి ఆజంఖాన్ లేదంటే ఆయన కుటుంబం సభ్యుల్లో ఎవరో ఒకరు క్రమం తప్పకుండా ఈ స్థానం నుంచి బరిలోకి దిగేవారు. 1977-2022 మధ్య ఆజంఖాన్ 12 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేశారు. పదిసార్లు ఆయన గెలుపొందగా, రెండుసార్లు ఓటమి పాలయ్యారు.

2019లో ఆజంఖాన్ ఎంపీగా గెలుపొందడంతో రాంపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య తజీన్ ఫాతిమా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇప్పుడు అసీం రజా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిజానికి 1980-1993 మధ్య కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండేది. అయితే, ఆ తర్వాత ఆజంఖాన్ ఈ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 1996లో మాత్రం కాంగ్రెస్ నేత అఫ్రోజ్ అలీఖాన్ గెలుపొందారు. అయితే, ఆ తర్వాత 2002 నుంచి 2022 వరకు ఐదుసార్లు విజయం సాధించారు. కాగా, ఈ స్థానం నుంచి బీజేపీ ఆకాశ్ సక్సేనాను బరిలోకి దింపింది.

More Telugu News