B12: బీ12 విటమిన్ లోపిస్తే మీ నాలుక చెప్పేస్తుంది!

  • శరీరానికి విటమిన్లు ఎంతో ముఖ్యం
  • ముఖ్యంగా బీ12 విటమిన్ లోపిస్తే పలు అనారోగ్య సమస్యలు
  • నాలుకపై పుండ్లు, మంట
  • సకాలంలో లోపాన్ని గుర్తించకపోతే దీర్ఘకాలంలో సమస్యలు
Tongue can say B12 Vitamin deficiency

మన ఆరోగ్య పరిరక్షణకు తగినంత పోషకాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి అందకపోతే మనిషి బలహీనపడడం, తద్వారా అనారోగ్యాలు చుట్టుముడతాయి. 

అయితే, మన దైనందిన ఆహారంలో విటమిన్లు, ఖనిజలవణాలు అవసరమైనంత మేర తీసుకుంటున్నామో లేదో నిర్దిష్టంగా చెప్పలేము కానీ, ఏ ఒక్క విటమిన్ లోపించినా, ఖనిజ లవణాల శాతం తగ్గినా వెంటనే మన శరీరం చెప్పేస్తుంది. 

విటమిన్లలో అత్యంత ముఖ్యమైనది... బీ12. శరీరంలో ఎర్ర రక్తకణాలు, డీఎన్ఏ అభివృద్ధికి తోడ్పడే కీలకమైన విటమిన్ ఇదే. రక్తకణాలు తగినంత ఆక్సిజన్ పొందేందుకు సహకరిస్తుంది. ఇది నరాల బలాన్ని పెంచడమే కాదు, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇలా ఏ విధంగా చూసినా శరీరానికి బీ12 ఎంతో అవసరం. 

బీ12 విటమిన్ లోపించినప్పుడు దాని ప్రభావం వెంటనే నాలుకపై కనిపిస్తుంది. నాలుకపై పుండ్లు, నాలుక వాపు, నాలుక కోసుకుపోయినట్టుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అది బీ12 లోపం కావొచ్చు. ఈ లక్షణాలను లింగ్యువల్ పారస్తీషియా అంటారు. 

ఓ 61 ఏళ్ల మహిళ నాలుక మంటతో దాదాపు ఆర్నెల్ల పాటు బాధపడింది. పలు ఆసుపత్రులకు తిరగ్గా, చివరికి అది బీ12 లోపం వల్లేనని వైద్య నిపుణులు నిర్ధారించారు. ఆమెకు ఓ బీ12 ఇంజెక్షన్ ఇవ్వగా, కేవలం మూడు రోజుల్లోనే నాలుక మంట, ఇతర సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. 

విటమిన్ బీ12 పొందాలంటే క్రమం తప్పకుండా పాలు, కోడిగుడ్లు, యోగర్ట్ (పెరుగు), కొవ్వుతో కూడిన చేపలు, మాంసం, ఆల్చిప్పలు, నత్తగుల్లలు, బలవర్ధకమైన తృణధాన్యాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News