Ukraine: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. ఉక్రెయిన్ నగరాల్లో అంధకారం

  • 70 లక్షల ఇళ్లకు దెబ్బతిన్న విద్యుత్ సరఫరా
  • మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు
  • రష్యా 85కు పైగా క్షిపణులను ప్రయోగించింది: జెలెన్ స్కీ ఆరోపణ
Seven million homes in dark as Russian missiles pound Ukraine cities

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. మంగళవారం క్షిపణులతో వరుసగా దాడులు చేసింది. పదుల సంఖ్యలో క్షిపణులను ఉక్రెయిన్ నగరాలపైకి వదిలింది. దీంతో రాజధాని కీవ్ తో పాటు దేశంలోని పలు నగరాలు అంధకారంలో చిక్కుకున్నాయి. సుమారు 70 లక్షల ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. రష్యా క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఉక్రెయిన్ వెల్లడించింది. లవీవ్, ఖార్కివ్ నగరాల్లో దాదాపు 80 శాతానికి పైగా ఇళ్లల్లో కరెంటు లేదని ఆయా నగరాల మేయర్లు తెలిపారు.

తమ నగరాలపై 85 క్షిపణులతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. దేశంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిపిందని పేర్కొన్నారు. తమ సైన్యం ధీటుగా స్పందించి పలు క్షిపణులను నేలకూల్చిందని జెలెన్ స్కీ తెలిపారు. క్షిపణి దాడులతో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రాలను వెంటనే పునరుద్దరించుకుంటామని చెప్పారు. తొందర్లోనే విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరిస్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ నగరం ఖేర్సన్ ను ఆక్రమించుకున్న రష్యా రెఫరెండం పేరుతో తనలో కలిపేసుకున్న విషయం తెలిసిందే! అయితే, నగర నిర్వహణ కష్టంగా మారడం, సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండడంతో ఖేర్సన్ నుంచి ఇటీవలే వైదొలిగింది. సిటీలో నుంచి తమ సైనికులను వెనక్కి పిలిపించుకుంది. దీంతో ఉక్రెయిన్ సైనికులు ఖేర్సన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సోమవారం ఖేర్సన్ లో ఆకస్మిక పర్యటన కూడా చేశారు. ఖేర్సన్ ను స్వాధీనం చేసుకోవడం యుద్ధం ముగింపునకు నాంది అని జెలెన్ స్కీ ప్రకటించారు. అయితే, ఖేర్సన్ ను వదులుకోవడాన్ని అవమానంగా భావించిన పుతిన్ తాజాగా క్షిపణి దాడులకు తెగబడ్డాడని యుద్ధ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News