CM Jagan: మరో 16 నెలల్లో ఎన్నికలు... మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా: కార్యకర్తలతో సీఎం జగన్

  • విశాఖ నార్త్ నియోజవర్గం వైసీపీ కార్యకర్తలతో సీఎం భేటీ
  • ఎన్నికల దిశగా కర్తవ్య బోధ
  • కష్టపడితే 175 సీట్లు ఖాయమని వెల్లడి
  • ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమేనని ధీమా
CM Jagan held meeting with Visakha North Constituency YCP workers

ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. మరో 16 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమయం ఉంది కదా అని కార్యకర్తలు ఉదాసీన వైఖరి కనబర్చరాదని స్పష్టం చేశారు. 

ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆశీస్సులు తీసుకోవాలని, రాష్ట్రంలో 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఉద్బోధించారు. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా... 175 సీట్లు ఎందుకు రావు? అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మీ భాగస్వామ్యం ఎంతో అవసరం అని కార్యకర్తలకు సూచించారు. 

కాగా, ఈ సమావేశానికి వచ్చిన విశాఖ నార్త్ కార్యకర్తలతో సీఎం జగన్ విడివిడిగా కూడా సమావేశమయ్యారు. వారి ద్వారా నియోజకవర్గ పరిస్థితులు తెలుసుకున్నారు.

More Telugu News