Twitter: తనతో వాదనకు దిగిన ట్విట్టర్ ఇంజనీర్​ను పబ్లిక్​గా ఉద్యోగం నుంచి తొలగించిన ఎలాన్ మస్క్

  • ఆదివారం ట్విట్టర్ నెమ్మదించడంపై క్షమాపణ చెప్పిన మస్క్
  • ట్విట్టర్ యాప్ వల్లే సమస్య అనడంపై ఇంజనీర్ అభ్యంతరం
  • ఈ విషయంలో వాదన తర్వాత అతనిపై వేటు వేసిన మస్క్
Elon Musk fires Twitter engineer in public for replying to him with facts

తాను ఏం చేసినా ట్విట్టర్ ఉద్యోగులు తనను ఎదురు ప్రశ్నించకూడదని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. తనకు ఎదురు మాట్లాడితే ట్విట్టర్లో ఉద్యోగం కోల్పోవాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న వెంటనే సంస్థలో పలువురు కీలక వ్యక్తులను తొలగించిన ఆయన తాజాగా బహిరంగంగా ఓ ప్రముఖ ఇంజనీర్ పై వేటు వేశారు. ట్విట్టర్‌లో తనతో వాదించిన ఇంజనీర్ ఎరిక్ ఫ్రోన్‌హోఫర్‌ను తొలగించినట్లు మస్క్ ప్రకటించారు. ముందుగా పలువురిపై మస్క్ వేటు వేసిన జాబితాలో ఎరిక్ లేడు. కానీ, ట్విట్టర్‌లో మస్క్‌తో వాదించినందున అతను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 

ఆదివారం పలు దేశాల్లో ట్విట్టర్ సర్వీసులు నెమ్మదించడంపై క్షమాపణలు చెబుతూ మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ యాప్ పని తీరు సరిగ్గా లేదని వివరణ ఇచ్చారు. కొద్దిసేపటికే దీన్ని ఎరిక్ రీట్వీట్ చేశాడు. మస్క్ వివరణను తప్పుబట్టాడు. తాను ఆండ్రాయిడ్ కోసం ట్విట్టర్‌లో 6 సంవత్సరాలపైనే పనిచేశానని, మస్క్ దానిపై నిందలు వేయడం తప్పు అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ విషయంలో ఇద్దరి మధ్య ట్విట్టర్ లో గొడవ నడించింది. ట్విట్టర్ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలపై ఇద్దరూ వాదించుకున్నారు. ఒక సమయంలో ఎరిక్ స్పందనపై కోపోద్రిక్తుడైన మస్క్, ట్విట్టర్ ఆదివారం పనితీరు గురించి అడిగారు. ‘ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్ చాలా నెమ్మదిగా ఉంది. దాన్ని పరిష్కరించడానికి మీరు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు. 

ఈ సంభాషణ మూడు గంటల పాటు కొనసాగింది. వరుస ట్వీట్ల తర్వాత, ఫ్రోన్‌హోఫర్‌ను తొలగించినట్లు మస్క్ ప్రకటించారు. అతను మస్క్ ట్వీట్‌కు సెల్యూటింగ్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. 41 ఏళ్ల ఫ్రోన్‌హోఫర్‌ ట్విట్టర్ లో 8 సంవత్సరాలుగా ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. సంస్థతో తన అనుబంధం ఇంత ఆకస్మికంగా ముగిసిందని అంగీకరించడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు.

More Telugu News