Delhi Liquor Scam: సీబీఐ కేసులో బెయిల్, ఆ వెంటనే ఈడీ కస్టడీకి అప్పగింత... అభిషేక్ రావుకు వింత పరిస్థితి

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సోమవారం అరెస్టయిన అభిషేక్ రావు
  • సీబీఐ కేసులో అభిషేక్ రావుకు బెయిల్ ఇచ్చిన కోర్టు
  • 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అభిషేక్ రావును అప్పగిస్తూ తీర్పు
  • వినయ్ నాయర్ కు కూడా ఇదే తరహా పరిస్థితి
abhishek rao gets bail in cbi case and gone into custocy of enforcement directorate

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావుకు సోమవారం వింత పరిస్థితి ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరికంటే ముందు బయటకు వచ్చింది అభిషేక్ రావు పేరేనన్న సంగతి తెలిసిందే. అయితే కాస్తంత ఆలస్యంగా సోమవారం ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయనను హాజరుపరచగా... అదే సమయంలో ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో అభిషేక్ రావుకు బెయిల్ ను మంజూరు చేసింది. 

కోర్టు నిర్ణయంతో అభిషేక్ రావు ఊపిరి పీల్చుకునేలోగానే... ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తమ కస్టడీలో ఈ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నారని, ఆయనతో కలిపి అభిషేక్ రావును విచారించాల్సి ఉందని ఆ పిటిషన్ లో ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. 

ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు... అభిషేక్ రావును 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెరసి సీబీఐ కేసులో బెయిల్ లభించినా.. అభిషేక్ రావు ఈడీ కస్టడీలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వినయ్ నాయర్ కు కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.

More Telugu News